ఒక్కసారి చావొద్దు.. క్షణ క్షణం చస్తాం

ఉరిశిక్ష వేయండి అని కోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడా దాన్ని అమలు చేయలేని దీనావస్థలో ఉంది మన వ్యవస్థ. ఒకటి కాదు రెండు కాదు.. నేరం జరిగి ఏకంగా ఏడేళ్లు పూర్తయ్యాయి. ఎనిమిదో…

ఉరిశిక్ష వేయండి అని కోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడా దాన్ని అమలు చేయలేని దీనావస్థలో ఉంది మన వ్యవస్థ. ఒకటి కాదు రెండు కాదు.. నేరం జరిగి ఏకంగా ఏడేళ్లు పూర్తయ్యాయి. ఎనిమిదో ఏట కూడా న్యాయం ఈరోజు రేపు అంటూ దోబూచులాడుతోంది. “చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు, నిందితులను ఎన్ కౌంటర్ చేయడం సరైన పద్ధతేనా, ఎంతమందిని చేస్తారు, ఎన్నాళ్లు” చేస్తారంటూ.. దిశ హంతకుల ఎన్ కౌంటర్ తర్వాత లేచిన నోళ్లు.. ఇప్పుడెందుకో మూగబోయాయి.

నిర్భయ పేరుతో ఏకంగా చట్టమే తీసుకొచ్చారు, కానీ ఆ చట్టం ఏడేళ్లుగా హంతకుల్ని ఏమీ చేయలేకపోవడానికి కారణం ఎవరు? వందమంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ, ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడకూడదు అని చెప్పే భారతీయ శిక్షాస్మృతిదా? లేక చట్టాల్లోని లొసుగుల్ని వాడుకుంటూ పదే పదే శిక్ష అమలు వాయిదా వేయిస్తూ హంతకుల్ని కాపాడుతున్నామన్న ఇంగిత జ్ఞానం కూడా లేని న్యాయవాదులదా?

కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్టు.. నిర్భయ హంతకుల బతుక్కి కారణాలు కూడా చాలానే ఉన్నాయి. అన్నిటికీ మించి ఈ నిందని ఒకరిపై ఒకరు నెట్టుకుని పబ్బం గడుపుకోవాలని చూస్తున్న బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలది మరీ నికృష్ట రాజకీయం. ఇలాంటి రాజకీయాల వల్లే రేపిస్ట్ లు, హంతకులు నిర్భయంగా బైట తిరగుతున్నారు. పైలోకమంటూ ఉంటే నిర్భయ ఇంకా రోదిస్తూనే కూర్చుని ఉంటుంది, దిశ మాత్రం ఎన్ కౌంటర్ జరిగిన రోజునే తనకి న్యాయం జరిగిందని ఊరట చెంది ఉంటుంది.

నిర్భయ హంతకుల ఉరి వాయిదా పడటంతో.. మరోసారి కమిషనర్ సజ్జనార్ అందరికీ గుర్తొచ్చారు. చేతకాని, చేవలేని వ్యవస్థలో ఇలాంటి హీరోలు కచ్చితంగా ఉండాల్సిందేనంటూ సలాం సజ్జనార్ సాబ్ అంటోంది సోషల్ మీడియా. ఉరి వాయిదా పడింది కానీ, తొలగిపోలేదు.. అదొక్కటే సంతోషించదగ్గ విషయం. ఎన్నిరోజులు వాయిదా పడినా క్షణ క్షణం బిక్కుబిక్కుమంటూ హంతకులు కాలం వెళ్లదీయాల్సిందే. రోజులు లెక్కపెట్టుకుంటూ రోజూ చచ్చిపోతున్న నిర్భయ హంతకుల బతుకు కంటే.. దిశ హంతకుల చావే సరైనదేమో.

ఉరి ఆలస్యమైందన్న బాధని పక్కనపెడితే.. ఉరికంటే ఎక్కువ మానసిక క్షోభను వారు తమకు తామే శిక్షగా విధించుకున్నారని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. 

మరో పెళ్లిచూపులు