అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ అనధికారికంగా మొదలైంది. జగన్ సర్కార్ అనుకున్నట్టుగా ముందుకే అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలి అడుగు శుక్రవారం అర్ధరాత్రి పడింది. కర్నూల్‌ను న్యాయ రాజధానిగా చేస్తామన్న మాట నెరవేర్చుకునే క్రమంలో జగన్ సర్కార్ కార్యాలయాల తరలింపు మొదలు పెట్టింది. అయితే రాజధాని అంశం హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
న్యాయ విభాగంలో భాగమైన విజిలెన్న్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ ,కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుల కార్యాలయాలను కర్నూల్‌కు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులిచ్చింది. ఇప్పటి వరకు ఈ విభాగాలన్నీ వెలగపూడి సచివాలయంలోనే ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో కర్నూల్‌కు తరలి వెళ్లనున్నాయి. ఈ కార్యాలయాల ఏర్పాటుకు బిల్డింగ్‌లను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీతో పాటు కర్నూల్ కలెక్టర్‌కు జగన్ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది.
తన అనుమతి లేకుండా ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని తరలించొద్దని గతంలో హైకోర్టు సూచించింది. అయితే పరిపాలన సౌలభ్యం కోసం అంటూ ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరి ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తోందననే ఉత్కంఠ నెలకొంది. కాగా అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణలో మొట్ట మొదటగా ఒక శాఖకు సంబంధించి కార్యాలయాల తరలింపు మొదలైనట్టుగా భావించాలి. మున్ముందు ఇదే విధంగా అన్ని కార్యాలయాలు తరలి వెళ్లే అవకాశం ఉంది.