జ‌గ‌న్ నిర్ణ‌యాల‌తో వైసీపీకి చ‌లిజ్వ‌రం

జ‌గ‌న్ స‌ర్కార్ కొన్ని నిర్ణ‌యాల వ‌ల్ల వైసీపీకి చ‌లిజ్వ‌రం ప‌ట్టుకొంది. అందులోనూ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో వైసీపీ శ్రేణులు బెంబేలెత్తుతున్నాయి. నిజానికి అధికారంలోకి వ‌చ్చిన ఏడెనిమిది నెల‌ల్లోనే జ‌గ‌న్ స‌ర్కార్ న‌వ‌ర‌త్నాల అమ‌లు…

జ‌గ‌న్ స‌ర్కార్ కొన్ని నిర్ణ‌యాల వ‌ల్ల వైసీపీకి చ‌లిజ్వ‌రం ప‌ట్టుకొంది. అందులోనూ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో వైసీపీ శ్రేణులు బెంబేలెత్తుతున్నాయి. నిజానికి అధికారంలోకి వ‌చ్చిన ఏడెనిమిది నెల‌ల్లోనే జ‌గ‌న్ స‌ర్కార్ న‌వ‌ర‌త్నాల అమ‌లు చేప‌ట్టి శ‌భాష్ అనిపించుకొంది. ఇదే స‌మ‌యంలో రేష‌న్‌కార్డుల ఏరివేత‌, పింఛ‌న్ల తొల‌గింపు వంటి చ‌ర్య‌ల వ‌ల్ల జ‌గ‌న్ స‌ర్కార్ అప్ర‌తిష్ట మూట‌క‌ట్టుకుంటోంది. ఈ చ‌ర్య‌ల వ‌ల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జ‌గ‌న్ స‌ర్కార్‌పై వ్య‌తిరేక‌త వ‌స్తోంది.

‘రేషన్ కార్డులు, పెన్షన్ లు తీయద్దండి స్వామి. ఊర్లల్లో సినిమా కనిపిస్తా ఉంది. ఆ రాజధానులు ఏవో ఒకటి అవుతాయి, ముందు నమ్ముకున్న వెల్ఫేర్ మీద కొంచెం స్టడీ చేయండి సార్’ .…ఈ కామెంట్స్ దంతులూరి కృష్ణ అలియాస్ మంగ‌ళి కృష్ణ త‌న ఫేస్‌బుక్ పేజీలో గ‌త నెల 29న పెట్టాడు. సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు దంతులూరి కృష్ణ అత్యంత స‌న్నిహితుడు.  

పులివెందులలో ఒక‌ప్పుడు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఇంటి ప‌క్క‌నే ఇత‌ని నివాస గృహం ఉండేది. ఒక సంద‌ర్భంలో అసెంబ్లీలో ఇత‌ని విష‌య‌మై డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి- చంద్ర‌బాబు మ‌ధ్య వాగ్వాదం కూడా జ‌రిగింది. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం వైసీపీలో కీల‌క నేత‌. కృష్ణ భార్య స‌ర్పంచ్‌గా ప్రాతినిథ్యం వహించారు. అలాంటి క‌ర‌డుగ‌ట్టిన వైసీపీ నేత సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకుంటున్న ప్ర‌జావ్య‌తిరేక నిర్ణ‌యాల‌పై గోడు వెళ్ల‌బోసుకున్నాడు.

ప్ర‌స్తుతం ఏ ప‌ల్లెను క‌దిలించినా ఒక‌టే భ‌యం…రేష‌న్‌కార్డులు , పింఛ‌న్లు పోతాయేమోన‌న్న భ‌యాందోళ‌న‌తో గ్రామీణులు బిక్కుబిక్కుమంటున్నారు. 300 యూనిట్లు క‌రెంట్ వాడినా, రూ.500 క‌రెంట్ బిల్లు వ‌చ్చినా, లేదంటే పది ఎక‌రాల భూమి ఉన్నా, కుమారుడు ప్ర‌భుత్వ ఉద్యోగి అయితే తండ్రి లేదా త‌ల్లి పింఛ‌న్‌ను తొల‌గిస్తున్నారు. అలాగే రేష‌న్‌కార్డులు ర‌ద్దు అవుతాయ‌నే భ‌యం గ్రామీణ ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

జ‌గ‌న్‌ను సీఎం చేసుకుంటే, ఏదో మంచి చేస్తాడ‌నుకుంటే…ఇలా చేస్తున్నాడేంటి అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప‌ల్లె ప్ర‌జ‌ల్లో దాగిన భ‌యం…కృష్ణ ఫేస్‌బుక్ కామెంట్ ప్ర‌తిబింబిస్తోంది. అంతేకాదు ‘ఆ రాజధానులు ఏవో ఒకటి అవుతాయి, ముందు నమ్ముకున్న వెల్ఫేర్ మీద కొంచెం స్టడీ చేయండి సార్’ అని ఎంతో నిర్వేదం, నిరుత్సాహంతో కామెంట్ పెట్ట‌డాన్ని వైసీపీ పెద్ద‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. ఎందుకంటే త్వ‌ర‌లో స్థానిక సంస్థ‌లు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ప్రస్తుతం గ్రామీణుల్లో ఉన్న భ‌యాందోళ‌న‌ల‌ను త‌రిమికొట్ట‌క‌పోతే మాత్రం…వైసీపీకి గ‌డ్డురోజులు త‌ప్ప‌వ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే ఇంత‌కాలం చంద్ర‌బాబు పాల‌న‌లో రేష‌న్‌కార్డులు, పింఛ‌న్ల‌కు ఎలాంటి ఢోకాలేదు. అలాంటిది జ‌గ‌న్ అధికారంలోకి 8 నెల‌ల కాలంలో కొత్త‌గా చేయ‌క‌పోగా, ఉన్న‌వి ఊడ‌గొడితే అందుకు త‌గ్గ మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ద‌ని గ్రామ‌స్థాయి వైసీపీ నాయ‌కులు ఆందోళ‌న చెందుతున్నారు.

మరో పెళ్లిచూపులు