ఇటీవలే జేడీయూ నుంచి బహిష్కృతుడు అయిన ప్రశాంత్ కిషోర్ కు ఇతర పొలిటికల్ పార్టీల వద్ద మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. పొలిటికల్ స్ట్రాటజిస్టుగా మంచి స్ట్రైక్ రేట్ ఉన్న వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు మంచి డిమాండే ఉండేది. అయితే ఆయన ఉన్నట్టుండి ప్రత్యక్ష రాజకీయాల వైపు వెళ్లారు. జేడీయూ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ ఆయనకు దక్కింది ఏమిటో కానీ.. హాట్ కామెంట్స్ చేస్తూ వచ్చాడు. జేడీయూకు మిత్రపక్షం అయిన బీజేపీపై రకరకాల కామెంట్లు చేశారు.
సీఏఏ తదతరాలను వ్యతిరేకించారు. అలాగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా కామెంట్లు చేశారు. అవి బీజేపీ వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే నితీశ్ కుమార్ మళ్లీ బిహార్ సీఎం కావాలని కోరుకుంటున్నట్టుగా ప్రకటించి తప్పుకున్నారు పీకే.
అలా ప్రత్యక్ష రాజకీయాలు ఒకింత చేదు అనుభవాన్నే మిగిల్చినా.. పీకేకు స్ట్రాటజిస్టుగా మాత్రం డిమాండ్ తగ్గుతున్నట్టుగా లేదు. అందులో భాగంగా ఇప్పటికే చేతిలో ఆఫర్లున్నాయి. కొన్ని పాత ఒప్పందాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఆప్ కు కూడా పీకే సహకారం కొనసాగుతూ ఉందని తెలుస్తోంది. ఆ పై ఇప్పుడు మరో పార్టీ పీకేతో ఒప్పందానికి రెడీగా ఉందట. అదే జేడీఎస్. ఈ కర్ణాటక పార్టీ కుంచించుకుపోతూ ఉంది.
ఇటీవలే ఈ పార్టీ నేత కుమారస్వామి కర్ణాటక సీఎం పదవిని కోల్పోయారు. అయితే అంతకు ముందు నుంచినే జేడీఎస్ ఓటు బ్యాంకుకు గండి పడింది. సీట్ల సంఖ్య తగ్గుతూ ఉంది. కుమారస్వామి తనయుడు ఎంపీగా కూడా ఓడిపోయారు. దేవేగౌడానే ఓడిపోయారు. ఈ నేపథ్యంలో పీకేతో ఒప్పందం కుదుర్చుకుని తమ ఓటు బ్యాంకును అయినా ఒడిసిపట్టుకోవడానికి కుమారస్వామి ప్రయత్నాలు చేయనున్నారట. త్వరలోనే జేడీఎస్ కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అమలు కాబోతున్నాయని వార్తలు వస్తున్నాయి.