అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తాప్పడ్’ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ తాప్సీ ఫస్ట్ లుక్ ‘కెవ్వు కేక’ అంటోంది. ఇప్పుడీ లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా తాప్సీ సినీ సంగతులతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా మీడియాతో పంచుకున్నారు. ‘చేయరాని పని’ చేసిన ఓ వ్యక్తిని ఏం చేసిందో ఆమె ఎంతో కసిగా చెప్పారు. చాలా కుతూహలం కలిగించే ఆ అంశం ఏంటంటే…
సమాజంలో కొందరి చేష్టల వల్ల మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోయారు. గురునానక్ జయంతిని పురస్కరించుకుని కుటుంబంతో కలిసి గురుద్వార్‌కి వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవం గురించి ఆమె ఆవేదనతో చెప్పారు.
‘‘మేము గురుద్వార్‌కి వెళ్లే సమయానికి ఆ ప్రాంతం చాలా రద్దీగా ఉంది. భక్తుల కోసం కొన్ని స్టాళ్లు ఏర్పాటు చేసి అల్పాహారం, భోజనం పెడుతున్నారు. నేనూ ఆ క్యూ లైన్లోకి వెళ్లా. నా వెనక చాలా ఖాళీ ఉన్నప్పటికీ ఒకతను నాకు తాకుతూ.. నా నడుం పట్టుకున్నాడు. కోపంతో రగిలిపోయా. మౌనంగా భరిస్తే…అతను ఇంకో మహిళ విషయంలో కూడా అట్లే ప్రవర్తిస్తాడు. అందుకే వెనక్కి తిరిగి ఆ వ్యక్తి చేయి పట్టుకుని వేలు విరిచేశాను. ఆ తర్వాతే అక్కడి నుంచి బయటకు వచ్చా. అప్పటికి గానీ నా మనసు శాంతించలేదు’’ అని తాప్సీ తనకు ఆవేదన మిగిల్చిన సంఘటన గురించి చెప్పారు. కుక్కకాటుకు చెప్పు దెబ్బ అనే చందంగా అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పిన తాప్సీని అభినందించాల్సిందే.