ఒకరేమో నేరస్తుల గుట్టుమట్టులను ఇట్టే బయటకు రాబట్టేస్తానని చెప్పుకునే ఘనమైన పోలీసుఅధికార చరిత్ర ఉన్నవాడు. మరొకరేమో.. సినీనటుడినని చెప్పుకునే వాడు. అయితే ఈ ఇద్దరూ మహానటనా కౌశలం ఉన్న డ్రామా నటులను మరిపిస్తున్నారు.. తెలుగు రాజకీయ రంగస్థలం మీద అద్భుతమైన డ్రామాలను పండిస్తున్నారు.
పవన్ కల్యాణ్ గారేమో.. నాకు ఏడాదికి ఇరవై కోట్లు ఇచ్చే (ఆ దామాషాలో భారీగా లెక్కలు చెప్పే) సినిమా పరిశ్రమను వదిలేసి ప్రజలకు సేవ చేయడానికి వచ్చా అని గతంలో చెప్పుకున్నారు. నూటికి వెయ్యి శాతం.. ఆ మాటల ముసుగులో ఎన్నికలకు ముందు ప్రజలను వంచించి.. ఓట్లు దండుకోవడానికి తప్ప.. ఆ మాటలు ఇతర ప్రయోజనాన్ని ఉద్దేశించినవి కాదు. కానీ.. ఆయన డ్రామా డైలాగులను ఆరోజే గుర్తించిన తెలుగు ప్రజలు దారుణంగా తిప్పికొట్టి.. అత్యంత అసహ్యకరమైన, అవమానకరమైన రీతిలో ఓడించి పంపినా కూడా ఆయనకు తెలివి రాలేదు.
తీరా ఇప్పుడు నాకు నటించడం ఒక్కటే తెలుసు. నా మీద ఆధారపడి చాలా మంది ఉన్నారు.. వారికోసం సినిమాలు చేయకతప్పదు అని చిలకపలుకులు పలుకుతున్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటి..? నిన్న ప్రజలకోసం సినిమా ఆదాయం వదిలేస్తున్నానని చెప్పినప్పుడు.. ఈ ‘ఆధారపడిన వాళ్లు’ గుర్తు రాలేదా? లేదా, రాజకీయంగా పదవిలోకి వస్తే.. ‘ఆధారపడిన వాళ్లు’కు అడ్డగోలుగా దోచిపెట్టేద్దామని అనుకున్నాడా? క్లారిటీ లేదు.
ఇకపోతే- లక్ష్మీనారాయణ పవన్ ను మించిన డ్రామా డైలాగులు వల్లిస్తున్నారు. ఎన్నికలకు చాలా కాలం ముందునుంచే పవన్ కల్యాణ్ స్టోరీ డిస్కషన్లు జరుగుతున్నాయి. ఆ సంగతి రాష్ట్రంలో కామన్ మ్యాన్ కు కూడా తెలుసు. కానీ.. నేరస్తుల రహస్యాలు కనిపెట్టడంలో అద్భుత చరిత్ర ఉందని ప్రజలు అనుకునే ఈ మాజీ పోలీసు అధికారి సరిగ్గా టికెట్ల కేటాయింపు సమయంలో పవన్ కల్యాణ్ పంచన చేరారు. పవన్ సినిమాలు మళ్లీ చేస్తారని తెలియకుండానే ఆ జ ట్టులో చేరారా? అనేది సందేహమే. తీరా ఇప్పుడు.. ఆ సాకు చూపించి రాజీనామా చేశారు. పవన్ కల్యాణ్ కుటుంబానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇద్దరూ ఇద్దరే.. అవకాశవాద కుటిల రాజకీయాలకు పరాకాష్ట అని ప్రజలు అనుకుంటున్నారు. ఇద్దరూ ఫాల్స్ మోడెస్టీ ప్రదర్శిస్తూ డ్రామా నటులను మరపిస్తున్నారని నవ్వుకుంటున్నారు.