జనసేన నుంచి నిష్క్రమించడానికి గల కారణాలను సీబీఐ మాజీ అధికారి లక్ష్మినారాయణ సింపుల్‌గా రెండు వాక్యాల్లో పవన్‌కు లేఖ ద్వారా వెల్లడించాడు. ‘పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాల్లో నటించనని మీరు పూర్వం అనేక పర్యాయాలు తెలిపారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధివిధానాలు లేవని తెలుస్తోంది’ అనేది లక్ష్మినారాయణ అభిప్రాయం. చాలా గౌరవంగా లక్ష్మినారాయణ జనసేన నుంచి తప్పుకున్నాడు.
లక్ష్మినారాయణ రాజీనామా లేఖను ఆమోదిస్తూ పవన్ కూడా ఆయనకు సమాధానిమిచ్చాడు. ‘నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, పాల ఫ్యాక్టరీలు లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగిని కాదు. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నా మీద ఆధారపడి చాలా కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం సినిమాలు చేయడం తప్పనిసరి అయింది. ఇవన్నీ తెలుసుకొని రాజీనామా లేఖలో లక్ష్మీనారాయణ ప్రస్తావించి ఉంటే బాగుండేది’ అని పవన్ తనదైన శైలిలో స్పష్టం చేశాడు.
సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సిమెంట్, పవర్ ప్రాజెక్టులు, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఉన్న పాల ఫ్యాక్టరీని దృష్టిలో పెట్టుకుని పవన్ పరోక్షంగా ఆ వ్యాఖ్యలు చేశాడు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగి అంటే లక్ష్మినారాయణను ఉద్దేశించే అనేది స్పష్టమవుతోంది. మరి ఇన్నివిషయాలు తెలిసిన పవన్‌కల్యాణ్ ఇకపై భవిష్యత్‌లో తానెన్నడూ సినిమాల్లో నటించనని, పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితం చేస్తానని గతంలో ఎందుకు చెప్పినట్టు?
మాటే కదా, ఏదో ఒకటి చెప్పేస్తే సరిపోతుందని అనుకున్నాడా? తెలిసిందల్లా సినిమానే అన్నప్పుడు, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? వచ్చి ఏం చేశారో కనీసం అంతరాత్మకైనా సమాధానం చెప్పుకుంటారా? జగన్, చంద్రబాబు మాదిరిగా రాజకీయాల్లోకి వచ్చి ఫ్యాక్టరీలు పెడదామనుకున్నారా?
మీరు గతంలో చెప్పిన విషయాలనే గుర్తు చేస్తూ లక్ష్మినారాయణ ప్రశ్నిస్తే….ఏవేవో చెప్పి, ఇవ్వన్నీ తెలుసుకుని రాజీనామా లేఖలో ప్రస్తావించి ఉంటే బాగుండేదంటారా? ఇదేనా మీ సంస్కారం? రాజకీయాల్లోకి వచ్చి పరిశ్రమలు స్థాపించుకోవచ్చని భావించి, ప్రజల నిరాదరణతో భంగపాటుకు గురై తిరిగి సినిమాల్లోకి పోయావని అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రశ్నిస్తే మాత్రం కుటుంబాలు, పార్టీని పోషించాలనే మాటలు చెప్పి తప్పించుకోవడం మీకు మాత్రమే చెల్లింది పవన్.