దశాబ్దాలుగా పొలిటికల్ డ్రామాలకు వేదిక అవుతూ ఉంది కర్ణాటక రాజకీయం. దక్షిణ భారతదేశంలో భారతీయజనతా పార్టీ తొలుత సొంతంగా అధికారం చేపట్టిన రాష్ట్రం కర్ణాటక. అది కూడా దశాబ్దాలకు సాధ్యం అయ్యింది. అయితే అది కూడా బోలెడంత పొలిటికల్ డ్రామా తర్వాత! కర్ణాటక పీఠం భారతీయ జనతా పార్టీకి చేజిక్కించిందన్నా.. దానికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది జేడీఎస్ కు.
స్పష్టమైన ప్రజాతీర్పు రాని రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. హంగ్ తరహా పరిస్థితులు కొత్త కాదు. ఎన్నికల్లో అమీతుమీ తలపడే పార్టీలు తీరా ఎన్నికలయ్యాకా పొత్తు అంటూ చేతులు కలిపేస్తాయి! ఎవరు ఎవరితో తలపడ్డా.. పార్టీలు ఎన్నికలయ్యాకా కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసేస్తూ ఉంటాయి. గతంలో ఎన్నికల ముందు కత్తులు నూరుకునే పార్టీలు, ఎన్నికలయ్యాకా పొత్తులు అంటూ చేతులు కలిపేవి. అయితే పార్టీల కన్నా ఎమ్మెల్యేలను కలుపుకుపోవడానికే ఉత్సాహం చూపే భారతీయ జనతా పార్టీ, ఈ సారి అలా ఎమ్మెల్యేలను తెచ్చుకునిప్రభుత్వ మనుగడను సాగించింది. ఇందులో కూడా డ్రామాలు, ట్విస్టులున్నాయి. ముఖ్యమంత్రి మార్పు అలాంటిదే!
మరి మరోసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం జరుగుతోంది. మరి ఈ సారి ఎలాంటి పొలిటికల్ డ్రామా, ట్విస్టులు ఉంటాయనేది అత్యంత ఆసక్తిదాయకమైన అంశం. ఇది వరకూ ఎన్నికల్లో తలపడిన పార్టీలు, ఫలితాల తర్వాత కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టుగా… ఈ సారి కూడా అలాంటిదే జరుగుతుందా అనేది అత్యంత ఆసక్తిదాయకమైన అంశం. కేంద్రంలోనూ, కర్ణాటకలోనూ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి ఈ సారి అసెంబ్లీ ఎన్నికల విసయం కేక్ వాక్ కాదని సర్వేలు చెబుతున్నాయి.
కొన్ని సర్వేలు అయితే కాంగ్రెస్ దే అధికారం అని చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైన స్థాయిలో మెజారిటీని సంపాదిస్తే తప్ప దానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండదని కచ్చితంగా చెప్పవచ్చు. మినిమం మెజారిటీకి కాస్త, అటూ ఇటూ స్థాయిలో సీట్లు వస్తే చాలవు కాంగ్రెస్ కు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకోలేని స్తాయిలో కాంగ్రెస్ కు సీట్లు రావాలి. అప్పుడే కాంగ్రెస్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కాస్త తేడా వస్తే.. మాత్రం కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీ ఏ మాత్రం అవకాశం ఇవ్వదు.
అసలే ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకోవడం భారతీయ జనతా పార్టీకి కాత్త కాదు. కర్ణాటకలో ఇలాంటి ఫీట్లను చేయడంలో భారతీయ జనతా పార్టీ ఆరి తేరిపోయింది. కేవలం కర్ణాటకలోనే కాదు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఈ ప్రావీణ్యాన్ని భారతీయ జనతా పార్టీ ఒక రేంజ్ లో ప్రదర్శించింది. మరి అలాంటిది కర్ణాటకలో ఇంకోసారి అలాంటి సత్తా చూపించడం బీజేపీకి ఏ మాత్రం కష్టం కాదు.
కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్కు వరకే చేరుకున్నా, మెజారిటీకి రెండు మూడు సీట్లను అధికంగా సాధించినా ఉపయోగం ఉండకపోవచ్చు. బోటాబోటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా దాన్ని అస్థిరపరచడమూ బీజేపీకి ఈజీనే. మెజారిటీ మార్కుకు ఏ ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ సాధించుకుంటే అప్పుడే దానికి కాస్త ఊరట. అయితే కాంగ్రెస్ ఆ స్థాయి విజయం సాధ్యం అవుతుందా? అనేది సందేహమే!
అయితే బీజేపీ ప్లాన్ బీ కూడా పెట్టుకుందనే టాక్ ఉంది. అది డీకే శివకుమార రూపంలో ఉందని, ఒకవేళ కాంగ్రెస్ మెజారిటీని సాధించినా తనను సీఎంగా చేయకపోతే డీకే శివకుమార రూపంలో తిరుగుబాటు రావొచ్చని, డీకేశిని అడ్డుపెట్టుకుని బీజేపీ తన ప్రభుత్వాన్ని తెరపైకి తీసుకురావొచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి! ఇక ఎలాగూ జేడీఎస్ పాత్ర ఉండనే ఉండవచ్చు. కనీసం నలభై సీట్లలో జేడీఎస్ గట్టి పోటీ ఇస్తుంది. తక్కువలో తక్కువ ముప్పై సీట్ల వరకూ అది సాధించినా సాధించవచ్చు.
గత పర్యాయం ఇదే తరహా ఉనికితో కుమారస్వామి సీఎం అయ్యాడు. ఎన్నికల తర్వాతి పొత్తుతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్సే కోరి ఆయనను సీఎంగా చేసి దాదాపు రెండేళ్ల పాటు ప్రభుత్వాన్ని కొనసాగించింది. ఈ సారి కూడా అలాంటి విచిత్రాలు ఉండవని అనడానికి ఏమీ లేదు!
హంగ్ తరహా ఫలితాలు వస్తే ఈ సారి కుమారస్వామిని బీజేపీనే ముందుగా ఆకర్షించవచ్చు. డిప్యూటీ సీఎం హోదాను ఆఫర్ చేసి మరీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ఉత్సాహాన్ని చూపవచ్చు. ఎలాగూ జేడీఎస్ కు సిద్దాంతాలు, రాద్ధాంతాలు లేవు. పేరుకు సెక్యూలర్ అని అయినా.. కాంగ్రెస్ తో అయినా, బీజేపీతో అయినా ఏ ముహూర్తంలో అయినా ఆ పార్టీ కలిసి మనుగడ సాగించగలదు.
ఈ సారి బీజేపీతో అవకాశం వచ్చినా, కాంగ్రెస్ తో అవకాశం కలిసి వచ్చినా జేడీఎస్ కు కావాల్సింది అధికారంలో వాటా మాత్రమే! పిట్టపోరూ, పిట్టపోరూ పిల్లి తీర్చిన తరహాలో ఇది వరకూ జేడీఎస్ అధికారాన్ని, ముఖ్యమంత్రి పీఠాన్ని పొందింది. అదే తరహా అవకాశం కోసం ఆ పార్టీ మరోసారి ఎదురుచూస్తూ ఉండవచ్చు. ప్రస్తుతానికి అయితే మూడు పార్టీలూ తమ యథాశక్తి పోరాడుతున్నాయి. ప్రజలు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చినా.. గ్రేట్ కర్ణాటక పొలిటికల్ సర్కస్ మాత్రం మరోసారి తెరపైకి రానుంది!