వివాహానికి మానవనాగరికతలో ఎన్నో శతాబ్దాల ఉనికి ఉంది. వివాహ వ్యవస్థ ఏర్పడి ఇప్పటికే శతాబ్దాలు గడిచి ఉంటాయి. బహుశా వేల సంవత్సరాలు కూడా! ఇలాంటి వ్యవస్థ కాలానికి, సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా అనేక మార్పుచేర్పులకు లోనవుతూ వస్తోంది కూడా! ఇప్పుడు వివాహం విషయంలో ఆచరణలో ఉన్న పద్ధతులేవీ ఐదారు దశాబ్దాల కిందట కూడా ఉండేవి కావని ఇటీవలి చరిత్రే చెబుతూ ఉంది! ఇలాంటి అంశాల్లో వైవాహిక జీవితంలో స్త్రీ, పురుషుల మధ్య వయసు వ్యత్యాసం కూడా ఒకటి.
ఇది ఒక దశలో సాంఘిక దురాచారంగా కూడా చరిత్రలో నిలిచింది. బాల్య వివాహాలు తెలుగు వారి సంస్కృతిలో కూడా ఒక దశలో భాగం అయ్యాయి. అమ్మాయికి యుక్త వయసు వస్తే ఆమెకు రక్షణ ఉంటుందో లేదో తెలియని సామాజిక పరిస్థితుల్లోనే బాల్య వివాహాలు జరిగి ఉండాలి. అలాగే వృద్దులైన పురుషులు అమ్మాయిల కుటుంబాలకు డబ్బులు ఇచ్చి చిన్న వయసు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న సాంఘిక దురాచారం కూడా ఉండిందని పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ చెబుతోంది.
ఒక్కో దశలో వివాహానికి సంబంధించి ఇలాంటి వ్యవహారాలు కొనసాగాయి. ప్రస్తుతానికి వస్తే.. వివాహం విషయంలో అమ్మాయి, అబ్బాయిల మధ్య వయసు వ్యత్యాసం బాగా తగ్గిపోయింది. కనీసం ఇరవై యేళ్ల కిందటి వరకూ అయితే పదేళ్ల వ్యత్యాసం కూడా ఓకే అనుకునే పరిస్థితి. అయితే ఇది కాస్తా ఐదేళ్ల స్థాయికి తగ్గింది. అమ్మాయి కంటే అబ్బాయి ఐదేళ్లు పెద్ద.. అనే పద్ధతి పదేళ్ల లో కొనసాగింది. ఇదే సమయంలో.. ఈ విషయంలో కూడా అమ్మాయిల వైపు నుంచి అభ్యంతరాలు మొదలయ్యాయి.
తమ కన్నా ఐదారేళ్ల పెద్దవాడిని కూడా పెద్దవాడిగా చూసేయడం మొదలైంది. అమ్మాయిలకు చాయిస్ పెరగడంతో ఐదారేళ్ల పెద్దవాడిని కూడా పెద్దవాడు అనడం మొదలైంది. తమ క్లాస్ మేట్ లాంటివాడు, సరిగ్గా తమ ఏజ్ వాడే తమకు వరుడు కావాలనే తత్వం పెరిగింది. సంబంధాల విషయంలో ఛాయిస్ ఎక్కువగా ఉండటంతో అమ్మాయిలకు కూడా అలా అనడం ఈజీ అయ్యింది!
అయితే ఆర్థికంగా అన్నీ ఓకే అనుకుంటే.. ఇప్పుడు కూడా ఐదారేళ్ల పెద్దవాడిని వరుడిగా చూసుకోవడం అమ్మాయిల కుటుంబాలకు కూడా ఓకేలాగా ఉంది పరిస్థితి. అయితే ఇదే సమయంలో కొందరు సెలబ్రిటీలు వంటి వారైతే తమ కన్నా వయసులో పదేళ్ల పెద్ద వాడిని కూడా పెళ్లి చేసుకుంటూ ఉన్నారు!
కరీనా కపూర్ కన్నా సైఫ్ అలీ ఖాన్ పదేళ్లు పెద్ద. అప్పటికే అతడు విడాకులు తీసుకున్నవాడు. పిల్లలున్న వాడు. అయినా కరీనా కు నచ్చాడు. అంత వయసు వ్యత్యాసం ఉన్నా ఆ జంట తమ సుఖ సంసారం గురించి సోషల్ మీడియాలో ఎంచక్కా ఫొటోలు పెడుతూనే ఉంది.
అలాగే బాలీవుడ్, టాలీవుడ్ వివాహాల్లో ఇలా వరుడు వధువు కన్నా పదేళ్ల పెద్దవాడు కావడం చాలా రొటీన్. మరి సామాన్యుల్లో ఇలాంటి పెళ్లిళ్లు చేసుకున్న మగువల్లో సర్వేను నిర్వహించగా, వయసులో తమ కన్నా పదేళ్ల పెద్దవాడిని పెళ్లి చేసుకున్న వారు శృంగారంలో చాలా ఆనంద పడ్డారట! తమ భర్త వయసులో పెద్దవాడు కావడంతో శృంగారం గురించి అతడికి బాగా తెలుసు అని, తనకేం కావాలో అర్థం చేసుకున్నాడని ఆ మగువలు చెప్పారట. అయితే ఇదేవారి నుంచి మరో కోణం.. వయసులో పది పన్నెండేళ్లు పెద్దవాడు కావడం వల్ల అతడికి శృంగారం పట్ల కొంతకాలానికి ఆసక్తి తగ్గిందని కూడా వాపోయారు.
ఆరోగ్యం, హార్మోన్ల ప్రభావం.. ఇవన్నీ అనువుగా ఉండి తాము శృంగారం పట్ల బాగా ఆసక్తిగా ఉన్నప్పుడే అతడు ఈ విషయం పట్ల అనాసక్తితో తయారయ్యాడంటూ వారు వివరించారు! ఇదీ వయసులో తమ కన్నా పదేళ్ల పెద్దవాడిని పెళ్లి చేసుకున్న వారి పరిస్థితి అని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతానికి సామాన్యుల్లో పది, పన్నెండేళ్ల పెద్దవాడిని పెళ్లి చేసుకునే అమ్మాయిలు దాదాపు లేరు! వధు, వరుల మధ్యన వయసు వ్యత్యాసం గరిష్టంగా ఐదారేళ్లకు చేరిందిప్పుడు!