తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఎప్పుడు పూర్తిగా తెరచుకుంటాయి. ఈ ప్రశ్న థియేటర్లతో సంబంధం వున్నవారు అంతా అడుగుతూనే వున్నా ఇండస్ట్రీ నుంచి మాత్రం సమాధానం రావడం లేదు.
ఆంధ్రలో థియేటర్లకు అనుమతి వచ్చింది. తెలంగాణలో కూడా నిన్నటికి నిన్న అనుమతి వచ్చింది. అయినా ఇండస్ట్రీ పెద్దల నుంచి కనీసపు స్పందన లేదు. అయితే తెలంగాణ నుంచి నిన్న వచ్చిన జీవో లో స్పష్టత లేదని, థియేటర్లకు సంబంధంచి మరో జీవో ఈ రోజే, రేపో వస్తుందని భావిస్తున్నారు. అలా వస్తే 4 నుంచి థియేటర్లు తెరుచుకోవాల్సి వుంటుంది.
ఇలాంటి నేపథ్యంలో క్రిస్మస్ కు కాస్త ముందుగా థియేటర్లను తెరవాలని ఇండస్ట్రీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వారం ముందుగా తెరిస్తే క్రిస్మస్ నాటికి జనం అలవాటు పడతారని పెద్దలు భావిస్తున్నారని బోగట్టా. జనాలు థియేటర్ కు అలవాటు పడాలి అంటే సరైన సినిమా ఒకటి అయినా పడాలి. అందుకే సాయి తేజ్ హీరోగా నిర్మంచిన సోలో బతుకే సో బెటరు సినిమాను వదిలే ఆలోచనలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా సమస్త హక్కులు జీ టీవీ కి విక్రయించేసారు. థియేటర్ హక్కులు కూడా జీ టీవీ వే. అందుకే జీ టీవీతో మాట్లాడి, సినిమా పెద్దలు అంతా సహకరించి, దాన్ని స్మూత్ గా థియేటర్ లోకి వదిలే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వినికిడి. జీ టీవీకి థియేటర్ లేదా డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ లేదు. అందుకే ఎలా చేస్తారు అన్నది చూడాలి.
ఓ మెగా హీరో సినిమా పడితే ఆంధ్రలో సహజంగానే థియేటర్లకు ఊపు వస్తుంది. ఆ ఊపు అలా కొనసాగడానికి గతంలో ఓటిటిలో విడుదలై వంద రోజుల దాటేసిన సినిమాలను వేసుకోవచ్చు. ఈ లోగా సంక్రాంతి వేళకు వందశాతం ఆక్యుపెన్సీ అనుమతి వస్తే అంతా నార్మల్ అవుతుందని భావిస్తున్నారు.