తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన సమత కేసులో దోషులకు ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఈ కేసు తుది తీర్పు గురువారం వెల్లడైంది.
కొమురంభీం జిల్లా లింగాపూర్ అటవీ ప్రాంతంలోని ఎల్లపటార్లో గత ఏడాది నవంబర్ 24న సమతను ముగ్గురు నిందితులు షేక్ బాబా, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూమ్లు అత్యాచారం, అనంతరం హత్య చేశారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని పౌర సమాజం డిమాండ్ చేసింది. ఈ కేసు సత్వర విచారణకు కేసీఆర్ సర్కార్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది.
అనేక మంది సాక్ష్యులను విచారించిన నేపథ్యంలో ఈ నెల 20న వాదనలు పూర్తి అయ్యాయి. 27న ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించాల్సి ఉంది. అయితే న్యాయమూర్తి అనారోగ్య కారణంగా ఈ నెల 30కు తీర్పును వాయిదా వేశారు. గురువారం నిందితులను జైలు అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులను కోర్టు హాల్లోకి జడ్జి పిలిపించారు. నిందితుల కుటుంబ వివరాలను జడ్జి అడిగి తెలుసుకున్నారు.
నేరం రుజువైందని నిందితులకు చెప్పారు. అయితే తమ కుటుంబాలకు తామే జీవనాధారమని వారు న్యాయమూర్తి ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. ముగ్గురు నిందితులకు నలుగురు పిల్లలున్నారని, శిక్ష తగ్గించాలని వేడుకున్నారు. ఇది ఇలా ఉండగా సమత భర్త గోపి, కుటుంబ సభ్యులు కోర్టుకు చేరుకున్నారు.
అలాగే సమత స్వగ్రామం గోనంపల్లె వాసులు సైతం కోర్టుకు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. తుది తీర్పు ఏం వస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూశారు. కోర్టు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. న్యాయమూర్తి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తుది తీర్పు చెప్పారు. దీంతో బాధితుల కళ్లల్లో ఆనంద భాష్పాలు రాలాయి.