తెలుగు సినిమాల్లో హాస్యభరితమైన పాత్రల్లో కనిపించే నటి కరాటే కల్యాణి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన ఫోన్ కు కొంతమంది అసభ్యకరమైన చిత్రాలను పంపుతున్నారంటూ ఆమె హైదరాబాద్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొన్నాళ్లుగా తను ఈ తరహా వేధింపులను ఎదుర్కొంటున్నట్టుగా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా సమాచారం.
అగంతకులు డైరెక్టుగా తన ఫోన్ కే అసభ్యకరమైన సందేశాలను పంపుతున్నారని, ఉదయం ఫోన్ చూడాలంటేనే భయపడే పరిస్థితి ఉందని ఆమె పేర్కొన్నారట. అసభ్య రాతలు, అశ్లీలమైన వీడియోలను తన ఫోన్ కు పంపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అలా మెసేజ్ లు వచ్చే నంబర్లను తను బ్లాక్ చేసినా, ఆ తర్వాత కొత్త నంబర్ల నుంచి తనకు అలాంటి సందేశాలనే పంపిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారని తెలుస్తోంది.
ఇలా తనను కావాలని టార్గెట్ గా చేసుకుని కొంతమంది ఎవరో అశ్లీల వీడియోలను పంపిస్తున్నారని కల్యాణి పేర్కొన్నారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.
ఇక తన ఫొటోలను కూడా మార్ఫింగ్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో చెడు ప్రచారం చేస్తున్నారని, తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించే రీతిలో వారు పోస్టులు పెడుతున్నారని కల్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది వరకూ పలువురు నటీమణులు కూడా ఇలాంటి సైబర్ చేష్టలపై ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుల వంతు కూడా వచ్చినట్టుగా ఉంది!