ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు అక్కడి రాజకీయ పరిశీలకులు. అయితే ఇది మళ్లీ సీఎం కావడం గురించి కాదు, ఎమ్మెల్యేగా గెలవడం గురించి. అరవింద్ పోటీ చేసిన నియోజకవర్గంలో ఆయనకు ఎదురు ఉండదని, ఆయన చాలా సులువుగా మరోసారి ఎమ్మెల్యేగా నెగ్గుతారని పరిశీలకులు అంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ మీద ఎవరిని పోటీ చేయించాలనే అంశం గురించి భారతీయ జనతా పార్టీ చాలా కసరత్తే చేసింది. ఆ విషయాన్ని చాన్నాళ్లు దాచి పెట్టింది. ఎవరో తిరుగులేని వ్యక్తిని ఆయన మీద పోటీకి దించడం అన్నట్టుగా బీజేపీ వాళ్లు కలరింగ్ ఇచ్చారు. అయితే చివరకు మాత్రం ఆ స్థాయి అభ్యర్థిని దించలేకపోయారని విశ్లేషకులు అంటున్నారు.
గతంలో అరవింద్ కేజ్రీవాల్ సాధించింది సాదాసీదా విజయం కాదు. 15 సంవత్సరాల పాటు ఢిల్లీని ఏలిన షీలా దీక్షిత్ మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు ఆయన. ఇక ఆప్ సంచలన విజయంతో ఆయన సీఎం అయ్యారు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు కూడా ఆప్ కు సానుకూలతే ఉందని ప్రచారం జరుగుతూ ఉంది. మరోసారి ఢిల్లీ పగ్గాలు ఆప్ కే అందుతాయని పరిశీలకులు అంచనా వేస్తూ ఉన్నారు.
ఒకవేళ ఈ ఎన్నికల్లో ఆప్ ఓడితే మాత్రం ఆ పార్టీ గల్లంతు అవుతుందని కూడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆమ్ ఆద్మీకి మిగతా చోట్ల అంత పట్టులేకుండా పోవడం.. ఢిల్లీకే పరిమితం అయిపోవడం.. పంజాబ్, హర్యానాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చూపించలేకపోవడం.. ఢిల్లీలో గనుక ఆప్ ఓడితే అంతే సంగతులని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు.