ఈడీ విచార‌ణ త‌ర్వాత‌…క‌విత‌లో హుషారు!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత గ‌త కొంత కాలంగా చాలా హుషారుగా క‌నిపిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో క‌విత పేరు తెర‌పైకి రావ‌డంతో ఆమెకు సంబంధించి మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. క‌విత‌ను…

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత గ‌త కొంత కాలంగా చాలా హుషారుగా క‌నిపిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో క‌విత పేరు తెర‌పైకి రావ‌డంతో ఆమెకు సంబంధించి మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. క‌విత‌ను అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్‌పై బీజేపీ రాజ‌కీయ బెదిరింపుల‌కు పాల్ప‌డాల‌ని ప్ర‌య‌త్నించింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే రాజ‌కీయ ఆట‌లో బీజేపీ ఎత్తుల‌కు బీఆర్ఎస్ పైఎత్తులేసింది.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో క‌విత‌ను ఈడీ గంట‌ల త‌ర‌బ‌డి విచారించింది. ప్ర‌తి విచార‌ణ సంద‌ర్భంలోనూ ఆమెను అరెస్ట్ చేస్తార‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున సాగింది. త‌న పేరు లిక్క‌ర్ స్కామ్‌లో వ‌చ్చిన నేప‌థ్యంలో క‌విత బెంబేలెత్త‌లేదు. పైగా మ‌రింత‌గా యాక్టీవ్ అయ్యారు. త‌న‌ను బీజేపీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కార్ టార్గెట్ చేయ‌డం వెనుక దురుద్దేశాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌డంలో ఆమె చొర‌వ చూపారు.

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు పార్ల‌మెంట్‌లో ఆమోదించాలంటూ ఢిల్లీ వేదిక‌గా ప‌లు పార్టీల‌ను క‌లుపుకుని దీక్ష‌కు దిగారామె. అలాగే ప‌లు చాన‌ళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. ఈ సంద‌ర్భంతా త‌న నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేలా గ‌ట్టి వాద‌న వినిపించారు. అలాగే బీజేపీ రాజ‌కీయ క‌క్ష‌తో వేధింపుల‌కు పాల్ప‌డ‌డాన్ని తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌ట్టారు. 

ఈడీ విచార‌ణ‌కు వెళ్లే సంద‌ర్భంలోనూ, అలాగే ముగిసిన త‌ర్వాత బ‌య‌టికి వ‌చ్చేట‌ప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల‌కు అభివాదం, విక్ట‌రీ సింబ‌ల్‌ను చూపిస్తూ జోష్ ప్ర‌ద‌ర్శించారు. ఈడీ విచార‌ణ త‌ర్వాత ఆమె రాజ‌కీయంగా మ‌రింత‌గా జ‌నంలోకి వెళ్ల‌డాన్ని గ‌మ‌నించొచ్చు. త‌న‌కు సంబంధించిన ప్ర‌తిదీ అప్‌డేట్ చేస్తున్నారు.

తాజాగా త‌న కాలికి గాయం కావ‌డాన్ని కూడా ఆమె ట్విట‌ర్ వేదిక‌గా తెలియ‌జేశారు. ‘నా కాలికి ఫ్రాక్చర్‌ అయింది. అందువల్ల మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఏదైనా సమాచారం లేదా సహకారం కోసం నా కార్యాలయం అందుబాటులో ఉంటుంది’ అని కవిత ట్వీట్ చేయడం గ‌మ‌నార్హం. ప్ర‌జ‌ల‌తో నిత్యం ట‌చ్‌లో ఉండాల‌నే ఆమె ఆలోచ‌న‌కు ఇది ఉదాహ‌ర‌ణ‌. క‌విత‌లో ఈ మాత్రం హుషారుకు బీజేపీ చ‌ర్య‌లే కార‌ణ‌మ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.