ఆయ‌న‌కు చెబితే ఓ బాధ‌…చెప్ప‌కుంటే!

తెలంగాణ‌లో రాజ‌కీయాలు హీటెక్కాయి. ఎంత‌లా అంటే…తాజా మండు వేస‌విలా అని చెప్పొచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రించ‌డాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌క అడుగులు వేస్తోంది. దీన్ని బీజేపీ అస‌లు జీర్ణించుకోలేక‌పోతోంది. తెలంగాణ‌లో బ‌య్యారం…

తెలంగాణ‌లో రాజ‌కీయాలు హీటెక్కాయి. ఎంత‌లా అంటే…తాజా మండు వేస‌విలా అని చెప్పొచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రించ‌డాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌క అడుగులు వేస్తోంది. దీన్ని బీజేపీ అస‌లు జీర్ణించుకోలేక‌పోతోంది. తెలంగాణ‌లో బ‌య్యారం ఉక్కు విష‌య‌మై వ‌దిలేసి, ఆంధ్రాపై ప్రేమ చూప‌డాన్ని బీజేపీ నేత‌లు తప్పు ప‌డుతున్నారు. దీంతో వారికి గ‌ట్టి స‌మాధానం ఇవ్వ‌డానికి మంత్రి కేటీఆర్ మీడియా ముందుకొచ్చారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కి ఓ రేంజ్‌లో చుర‌క‌లు అంటించారు. విశాఖ ఉక్కుపై చూపుతున్న ఉత్సాహం తెలంగాణ‌లోని బ‌య్యారంపై ఎందుకు చూప‌లేద‌ని బండి సంజ‌య్ అడుగుతున్నార‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు. విష‌య ప‌రిజ్ఞానం లేని బండి సంజ‌య్‌కి చెబితే ఓ బాధ‌, చెప్ప‌కుంటే ఓ బాధ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బండి సంజ‌య్‌కి వ‌చ్చిన అనుమానం మ‌రొక‌రికి రావ‌ద్ద‌నే ఉద్దేశంతో వివ‌ర‌ణ ఇస్తున్న‌ట్టు మంత్రి తెలిపారు.  

‘బండి సంజ‌య్‌కి పరిజ్ఞానం లేదు. విషయం తెలియదు. ఆయన విచిత్రమైన మనిషి. ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడుతాడో అర్థం కాదు. కానీ ఆయన లేవనెత్తిన ప్రశ్న.. వేరేవాళ్లకు వస్తే వారికి అయినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది’ అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కుకు, బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌కు మధ్య ఉన్న ముఖ్యమైన సంబంధం బైలదిల్లాలో ఉండే ఐరన్‌ ఓర్ అని అన్నారు. 

బైలదిల్లా అనేది ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఒడిశా దాకా వ్యాపించిన ఐరన్‌ ఓర్ గని అన్నారు. ఇది చాలా పెద్ద గని అని తెలిపారు. ఈ గ‌నిలో 134 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఐరన్‌ ఓర్ ఉంద‌న్నారు. భౌగోళికంగా చూస్తే ఇది బయ్యారం నుంచి 150-160 కిలోమీటర్ల దూరంలో ఉంద‌న్నారు. వైజాగ్‌ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉంద‌న్నారు. బైలదిల్లాలో నాణ్యమైన ఐరన్‌ ఓర్‌ ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థలే తేల్చి చెప్పాయ‌న్నారు.

2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో వివరంగా చెప్పారన్నారు. అదే విధంగా కడపలో కూడా స్టీల్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా ద్వారా అక్కడ స్టీల్‌ ప్లాంట్‌ పెట్టే అవకాశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ప్ర‌భుత్వం చెప్పింద‌న్నారు. తెలంగాణలోని బయ్యారం గురించి  2014 నుంచి అడుగడుగునా ప్రశ్నిస్తున్నామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర‌ పరిశ్రమల మంత్రుల‌ను క‌లుస్తున్నామ‌న్నారు. జూన్‌ 2018లో స్వయంగా ప్రధాని మోదీని కలిసి బయ్యారం గురించి మాట్లాడిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు.

ఒకే దెబ్బకు రెండు పిట్టల‌న్న చందంగా ఒక బైలదిల్లాను అదానీకి కట్టబెట్టడంతో రెండు తెలుగు రాష్ట్రాలను చావుదెబ్బ తీసింద‌ని కేటీఆర్ వాపోయారు. బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్ పెడదామంటే అదానీకి మన జుట్టు ఇవ్వాల‌న్నారు. అదానీ, మోదీ చెప్పినట్లు వినాల‌న్నారు. బయ్యారం ఈజ్‌ నాట్‌ ఫీజబుల్ అంటూ బ‌య్యారంలో ఉక్కు ప‌రిశ్ర‌మ పెట్టేది లేద‌ని కేంద్ర‌మంత్రి కిషన్‌ రెడ్డి తేల్చి చెప్పాడ‌న్నారు. నాణ్యమైన ఐరన్‌ ఓర్‌ అదానీకి అప్పజెప్ప‌డం వ‌ల్లే ఈ దుస్థితి అని విమ‌ర్శించారు.

వైజాగ్‌ పొట్టకొడుతున్నది ప్రధాని, అదానీ అని కేటీఆర్ ఆరోపించారు. బయ్యారం ఎండబెడుతున్నది కూడా ప్రధాని, ఆదానీయే అని విరుచుకుప‌డ్డారు. ఇక్కడ ఉండే అజ్ఞానికి.. ఆ ఆదానికి సంబంధం మాకు అవసరం లేదన్నారు. కానీ ప్రధాని, ఆదానీ కలిసి తెలుగు రాష్ట్రాల ప్రజల పొట్టుకొడుతున్నారనేది వాస్తవం అని స్ప‌ష్టం చేశారు.