అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి వ్యతిరేకంగా పట్టణంలో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఇది రాజంపేటలో కలకలం రేపుతున్నాయి. వైఎస్ జగన్‌పై మాత్రం నమ్మకం ఉందని, కానీ మేడా మల్లికార్జున్‌రెడ్డిపై లేదంటూ పోస్టర్లు అతికించడం చర్చనీయాంశమైంది.
“మా నమ్మకం నువ్వే జగనన్న.. కానీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పైన నమ్మకం లేదు” అంటూ పోస్టర్లు కనిపించడం విశేషం. ఈ పోస్టర్లను మోసపోయిన వైసీపీ నాయకులు, కార్యకర్తల పేరుతో వేయడం గమనార్హం. వైసీపీలో వర్గ విభేదాలే ఈ పోస్టర్లు ప్రత్యక్షం కావడానికి కారణమా? లేక ప్రత్యర్థి పార్టీలవారెవరైనా ఈ పని చేశారా? అనే చర్చకు తెరలేచింది. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలున్నాయి.
పార్లమెంట్ నియోజకవర్గమైన రాజంపేటను కాదని, రాయచోటిని జిల్లా కేంద్రం చేయడాన్ని మేడా మల్లికార్జున్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ ఆయన కూడా ఆందోళనలు చేశారు. అయినప్పటికీ సొంత ప్రభుత్వం ఆయన మాటను పట్టించుకోలేదు. జిల్లా కేంద్రం విషయంలో వైసీపీలో విభేదాలు చోటు చేసుకున్నాయి. రాజంపేట, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు ఒంటరయ్యారు.
ఇక ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో వర్గవిభేదాలు బయటపడుతున్నాయి. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు ఎవరైనా ఈ పోస్టర్లను ప్రచురించారా? అనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా జగన్‌పై నమ్మకాన్ని ఉంచి, వైసీపీ ఎమ్మెల్యేపై అపనమ్మకం అంటూ పోస్టర్లు ప్రత్యక్షం కావడం రాజంపేట నియోజకవర్గంలో రచ్చకు దారి తీసింది.