మున్సిపోల్స్ ఫలితాల మీద టీ కాంగ్రెస్ విశ్లేషణ షురూ చేసిందట. లోక్ సభ ఎన్నికల సమయంలో కాస్త పుంజుకున్నట్టుగా కనిపించిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ స్థానిక ఎన్నికల్లో పాత స్థితికే వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నాటి ఫలితాలను పొందింది. ఈ ఫలితాల సమీక్షలో కొన్ని షాకింగ్ విషయాలను అర్థం చేసుకున్నారట కాంగ్రెస్ నేతలు. ఎంతలా అంటే.. కొన్ని చోట్ల బీజేపీ, కమ్యూనిస్టు పార్టీల కన్నా కాంగ్రెస్ కు తక్కువ ఓట్లు, సీట్లు వచ్చాయట! ఇది మాత్రం కాంగ్రెస్ కు అత్యంత ఆందోళన కరమైన అంశమని వారు భావిస్తున్నారట.
తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని చోట్లా చాంఫియన్ గా నిలిచింది. మిగతా ప్రతిపక్షాలు కేవలం పోటీ మాత్రమే ఇవ్వగలిగాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల పోటీ కూడా ఇవ్వలేకపోయిందట. తృతీయ స్థానానికి పరిమితం అయిపోయింది. అలాంటి చోట భారతీయ జనతా పార్టీ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. ఇన్నాళ్లూ కాంగ్రెస్- టీఆర్ఎస్ పోరు సాగింది. స్థానిక ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించినట్టుగా తేలిందట కాంగ్రెస్ పరిశీలనలో.
పార్టీకి ముందు నుంచి బలం ఉన్న నల్లగొండ, భువనగిరి, మల్కాజ్ గిరి వంటి ఎంపీ సీట్ల పరిధిలో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. అది పోటీ ఇవ్వడం మాత్రమే! అంతకు మించి సీన్ లేదు. తెలంగాణలో ఒకానొక దశలో ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ కు సాలిడ్ ఓటు బ్యాంకు ఉండేది! అలాంటి ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేశాకా కాంగ్రెస్ పార్టీ తన మూలాలను కోల్పోయింది! ప్రజల ఆకాంక్షను నెరవేర్చినట్టుగా కాంగ్రెస్ చెప్పుకున్నా ఆ పార్టీ పరిస్థితి మాత్రం క్రమంగా దయనీమైన పరిస్థితుల్లోకే పడిపోతూ ఉంది. సరైన నాయకుడు లేకపోవడమే కాంగ్రెస్ పార్టీకి పెనుశాపం అని స్పష్టం అవుతూ ఉంది. జగన్ తో వ్యవహరించిన తీరు, ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్లు చంద్రబాబుకు కొమ్ము కాస్తూ ఉండటం.. ఇవన్నీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ చిత్తు కావడానికి కారణాలుగా నిలుస్తూ ఉన్నాయి. ఈ విషయాలేవీ అర్థం కానట్టుగా టీ కాంగ్రెస్ నేతలు సమీక్షలు చేసుకుంటూ ఉన్నారు.