కేసీఆర్ తెగింపు జగన్ లో ఉందా..?

తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలో కేసీఆర్ మరీ అరాచకంగా ఉన్నారనే వాదన అప్పట్లో వినిపించింది. చివరకు ఉద్యోగులే తమ డిమాండ్లు నెరవేరకపోయినా సమ్మె విరమించి పనిలోకి వచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ పెద్ద…

తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలో కేసీఆర్ మరీ అరాచకంగా ఉన్నారనే వాదన అప్పట్లో వినిపించింది. చివరకు ఉద్యోగులే తమ డిమాండ్లు నెరవేరకపోయినా సమ్మె విరమించి పనిలోకి వచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ పెద్ద మనసు తెలుసుకున్నారు. ఆయనతో కలసి పనిచేసి దేవుడంటూ కీర్తించారు. 

ఇక్కడ కూడా ఏపీ ఉద్యోగులు అపోహలతో సమ్మెకు వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ ప్రభుత్వంపై  అభాండాలు వేస్తున్నారు. మరి ఇక్కడ కేసీఆర్ కి ఉన్న తెగింపు జగన్ కి ఉందా. ఉద్యోగులే సమ్మె విరమించే వరకు పీఆర్సీపై జగన్ వెనక్కి తగ్గకుండా ఉండగలరా..?

తెగింపు ఉన్నట్టే కనిపిస్తున్నా..?

ఇప్పటివరకైతే ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో కఠినంగానే ఉంది. పీఆర్సీ విషయంలో కాస్త మెత్తబడినా హెచ్ఆర్ఏ కోతలో మాత్రం మొహమాటాలకు పోలేదు. దీంతో ఉద్యోగులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. కానీ ప్రభుత్వం అంతకంటే ఏమీ చేయలేకపోతోంది. ఇటు ఆర్థిక కష్టాలున్నాయి, ఈ దశలో సంక్షేమ కార్యక్రమాలను ఆపితే అది ప్రభుత్వానికి అప్రతిష్ట. అందుకే అర్థం చేసుకోండి అంటూ ఉద్యోగుల విషయంలో చాలా పెద్దమాటే మాట్లాడారు జగన్. కానీ ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. ఈ దశలో ప్రభుత్వం కఠినంగా ఉండక తప్పదు.

కోర్టులో కూడా కేసు నిలబడదనే విషయం ఆల్రడీ రుజువైంది. ప్రభుత్వాలకు జీతాలు పెంచే అవకాశం ఉన్నట్టే, తగ్గించే అధికారం కూడా ఉందని తేలిపోయింది. అంటే న్యాయపోరాటంతో ఉద్యోగులు సాధించేదేమీ లేదు, ఇక ఊ అంటే ఉంటావు, ఊఊ అంటే దిగిపోతావంటూ చేసిన బెదిరింపుల్ని జనమే చీదరించుకుంటున్నారు. ఒక రకంగా జనం జగన్ వైపు ఉన్నారు, అంటే ఆయనకే మోరల్ సపోర్ట్ ఉంది. ఇక ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉన్నా వచ్చే నష్టమేమీ లేదు.

ఐఆర్ విషయంలో జగన్ ని దేవుడు అని పొగిడిన నోళ్లే, ఇప్పుడు పీఆర్సీ విషయంలో జగన్ ని తిడుతున్నాయి. రేపు పరిస్థితులు అనుకూలించి జీతాలు పెంచితే వారే జగన్ ని దేవుడంటారు. ఈమాత్రానికే ఇప్పుడు రోడ్లెక్కడం, సమ్మె నోటీసివ్వడం.. ఇవన్నీ ఎందుకు..? అక్కడ తెలంగాణలో కేసీఆర్ నిరంకుశంగా ఆర్టీసీ సమ్మెను అణగదొక్కినా.. ఆ తర్వాత ఉద్యోగులకు దేవుడయ్యారు. ఏపీలో ఆల్రడీ ఆర్టీసీ ఉద్యోగులకు అంతకంటే ఎక్కువ మేలు చేశారు జగన్. ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారు.

మంచిగా ఉంటే మంచి అని ఆల్రడీ రుజువైంది. ఎదురు తిరిగితే గొంతెమ్మ కోర్కెలను సహించేది లేదనే విషయాన్ని ఇప్పుడు తెలియజేయాల్సి ఉంది. మరి జగన్ అంత సాహసం చేస్తారా.. కేసీఆర్ లాగా తెగించి నిలబడగలరా..? లేక ఉద్యోగుల డిమాండ్లకు తలొగ్గుతారా..?  వేచి చూడాలి.