ఏపీలో జిల్లాల విభజనపై నేడో రేపో కీలక ప్రకటన

పాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలను విభజించబోతున్నారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారు. లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలనుకుంటున్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ఈ అంశం, వైసీపీ అధికారంలోకి…

పాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలను విభజించబోతున్నారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారు. లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలనుకుంటున్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ఈ అంశం, వైసీపీ అధికారంలోకి వచ్చాక తెరపైకి రావడానికి ఇన్నాళ్లు సమయం పట్టింది. 

గతంలో కూడా ప్రకటన వచ్చేసింది అనుకున్న సమయంలో అనుకోకుండా వాయిదా పడింది. జన గణనను ఓ కారణంగా చెబుతున్నా.. కరోనా వల్ల అది సాధ్యమయ్యేలా లేకపోవడంతో ఎలాగైనా కొత్త జిల్లాల ఏర్పాటుని మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

నేడో రేపో ప్రకటన..

కొత్త జిల్లాల ఏర్పాటుకి ముందుగా నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన జీవోని రేపు విడుదల చేస్తారని తెలుస్తోంది. సీఎం జగన్ ఇప్పటికే ఈ ప్రతిపాదనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలో జీవో విడుదల అవుతుందని అంటున్నారు.

ఎన్ని జిల్లాలు..?

జిల్లాలు విభజిస్తారు సరే.. లోక్ సభ నియోజకవర్గాల వారీగా జిల్లాలు విభజిస్తే ఆ సంఖ్య 25 దగ్గర ఆగిపోతుంది. అరకు లోక్ సభ నియోజకవర్గం మరీ పొడవుగా ఉంటుంది. దాన్ని రెండుగా విభజించాల్సి వస్తే మాత్రం జిల్లాల సంఖ్య 26కి పెరుగుతుంది. పోనీ ఇవన్నీ కాదు అంటే మరో మధ్యేమార్గం కూడా ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉంది. 

ఇప్పుడున్న 13 జిల్లాలను 19 జిల్లాలకు పెంచే ప్రతిపాదన కూడా ఉంది. అయితే వీటిలో దేనికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో తేలాల్సి ఉంది. అసలు ఏపీలో జిల్లాలు 13 నుంచి 19కి పెరుగుతాయా, లేక 25 అవుతాయా, 26కి పెంచుతారా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ క్లారిటీతో పాటే జీవో కూడా విడుదల అవుతుంది.

శ్రీకాకుళం వాసుల కష్టాల సంగతేంటి..?

శ్రీకాకుళం జిల్లాలో అరకు నియోజకవర్గాన్ని విభజిస్తే చాలామంది ఇబ్బంది పడతారు. అరకు లోక్ సభ నియోజకవర్గంలో రెండు మూడు జిల్లాలు కలసి ఉంటాయి. ఇప్పటి వరకయితే ఆయా జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు వారికి పెద్దగా ఇబ్బందులు లేవు, ఒకవేళ, అరకుని విడదీస్తే మాత్రం అందరికీ ఇబ్బందే. దీంతో మరోసారి శ్రీకాకుళం జిల్లా వాసులు ఆందోళనకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ దశలో ప్రభుత్వం వారి అనుమానాలను ఎలా తొలగిస్తుందనేది ప్రశ్నార్థకం.