మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి తెలుగుదేశం పార్టీ రన్నింగ్ కామెంట్రీ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ పలు రకాలుగా డిమాండ్ చేస్తూ ఉంది. తాజాగా మాజీ మంత్రి చిన్నరాజప్ప కూడా అదే డిమాండ్ చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాల్సిందే అని ఈయన డిమాండ్ చేశారు.
నిజమే.. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ డిమాండ్ ను సీరియస్ గానే తీసుకుందాం. మరి ఇదే పని తెలుగుదేశం ఎందుకు చేయలేదు? వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది ఇప్పుడేమీ కాదు. చంద్రబాబు నాయుడు చేతిలో అధికారం ఉన్నప్పుడే. వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని అప్పుడు ఆయన కూతురు గట్టిగా డిమాండ్ చేశారు. అప్పుడు చంద్రబాబు ఏమన్నారు? టీడీపీ వాళ్లు ఏమన్నారు? సీబీఐ ధర్యాప్తు దండగ అని తెలుగుదేశం పార్టీ అప్పుడు వ్యాఖ్యానించింది. సీబీఐ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదని.. ఆ హత్య కేసును గంటల్లోనే తేల్చేస్తామని చెప్పారు. ఆ హత్య కేసు విషయంలో జగన్ ను కూడా నిందించింది తెలుగుదేశం పార్టీ. అలాంటి నిందలు వేసి, ఆ హత్య కేసు సీబీఐ వరకూ వెళ్లకుండా ఆపింది తెలుగుదేశం పార్టీ వాళ్లే. అదెందుకు చేశారో వారికే తెలియాలి!
సపోజ్ ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎవరినైనా రక్షించడానికి ఈ హత్య కేసును సీబీఐకి అప్పగించకుండా ఉన్నాడనేది తెలుగుదేశం ఆరోపణ. మరి జగన్ కు ఈ ఉద్దేశం ఉందని అంటున్న టీడీపీ..తమకు ఏ ఉద్దేశాలు ఉండేవో చెప్పాల్సి ఉంది. హత్య జరిగిన వెంటనే..ఆ కేసును ఎందుకు సీబీఐ కి ఇవ్వలేదో.. అప్పుడు తెలుగుదేశం ఎవరిని రక్షించాలని చూసిందో టీడీపీనే చెప్పాలి! ఇప్పుడు జగన్ కు ఏయే ఉద్దేశాలను తెలుగుదేశం పార్టీ ఆపాదిస్తూ ఉందో, అప్పుడు టీడీపీకి కూడా అవే ఉద్దేశాలు ఉన్నట్టే. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారం పోయాకా మరోలా మాట్లాడుతున్న తెలుగుదేశం ధోరణే అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది.