తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మండలి రద్దును అడ్డుకునేందుకు మరో వ్యూహాన్ని పన్నబోతూ ఉన్నారా? అందు కోసం తన పార్టీ ఎమ్మెల్సీలను త్యాగం చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు రెడీ అవుతున్నారా? మండలి రద్దును చంద్రబాబు నాయుడు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు చేతిలో ఇప్పుడేమీ లేదు. ఉన్నదల్లా ఆ ఎమ్మెల్సీలు మాత్రమే. వారిని ఇప్పుడు బీజేపీలోకి పంపించి చంద్రబాబు నాయుడు మండలి రద్దును అడ్డుకునే వ్యూహాన్ని పన్నుతున్నారనే టాక్ వినిపిస్తూ ఉంది.
ఎన్నికలు అయిపోగానే చంద్రబాబు నాయుడుకు అత్యంత ఆప్తులు అయిన రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ఎడమ చెయ్యి, కుడి చెయ్యిలా పని చేసిన నేతలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అదంతా చంద్రబాబు వ్యూహమే అని చాలా మంది స్థిరమైన అభిప్రాయాలతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగా వాళ్లు అలానే పని చేస్తున్నారనే మాటా తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి క్రమంలో తన పార్టీ వాళ్లను బీజేపీలోకి పంపి చంద్రబాబు నాయుడు తన రాజకీయం అమలయ్యేలా చేసే వ్యూహాలనూ అనుసరించగలరని స్పష్టం అవుతూ ఉంది.
ఈ నేపథ్యంలో.. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్సీలను బీజేపీలోకి చేర్చి.. మండలి రద్దు అయితే బీజేపీకి నష్టం అనే పరిణామాలకు రంగం సిద్ధం చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. మండలిలో తెలుగుదేశం పార్టీకి 30 మంది ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వారిలో 20 మంది వరకూ బీజేపీలోకి చేరడం, బీజేపీలోకి మండలిలో తెలుగుదేశం విభాగం విలీనం చేయడం.. ఆ పై మండలిని నిలబెట్టే బాధ్యత కమలం పార్టీకే వదిలేయడం… ఇదీ చంద్రబాబునాయుడు స్కెచ్ అనే టాక్ వినిపిస్తూ ఉంది.
వినడానికి ఇది కొంచెం విడ్డూరంగానే అనిపించినా.. చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యూహాలు పన్నడం పెద్దగా ఆశ్చర్యం కాదేమో. రాజ్యసభ సభ్యుల వ్యవహారం చూశాకా.. ఇప్పుడు మండలి సభ్యులనూ చంద్రబాబు నాయుడు అలానే వాడుకోవచ్చు.. తన పార్టీని త్యాగం చేసి అయినా తన తనయుడి ఎమ్మెల్సీ హోదాను నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు సాగించవచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.