డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్.. ఈ రెండు సినిమాలకు మధ్య గ్యాప్ ఏడు నెలలు. కానీ ఈ 7 నెలల్లో హీరో విజయ్ దేవరకొండలో వచ్చిన మార్పు అంతా ఇంతా కాదు. న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకోవడమే కాదు, సినిమా ప్రచారంలో కూడా పూర్తిగా తేడాలొచ్చేశాయి.
డియర్ కామ్రేడ్ టైమ్ కి విజయ్ ఇమేజ్ పీక్స్ లో ఉంది. దానికి అనుగుణంగానే.. సినిమాని దక్షిణాది భాషల్లోకి డబ్బింగ్ చేయడంతో పాటు, ఆయా రాష్ట్రాలకు వెళ్లి మరీ ఈవెంట్లు చేసి వచ్చాడు విజయ్. అంతేనా.. సినిమా స్టిల్స్, ఫస్ట్ లుక్, పోస్టర్లు, ఆడియో, లిరికల్ సాంగ్స్.. ఇలా అన్ని విషయాలను దగ్గరుండు చూసుకున్నాడు, మాంచి క్రేజ్ తీసుకొచ్చాడు. ఇప్పుడు కొత్త సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో మాత్రం ఈ హడావిడి పూర్తిగా తగ్గిపోయింది.
అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. ప్రచారం చేస్తే సరిపోదు, సినిమాలో కంటెంట్ ఉండాలనే విషయాన్ని గుర్తించాడు బంగారుకొండ. అందుకే వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో ఆచితూచి స్పందిస్తున్నాడు. విజయ్ దేవరకొండ కంటే ముందు నిర్మాత కేఎస్ రామారావు మీడియా ముందుకొచ్చాడంటే మేటర్ అర్థంచేసుకోవచ్చు. దేవరకొండ సినిమాలకు సంబంధించి ఇంతకుముందెప్పుడూ ఇలా జరగలేదు.
బొగ్గుగనిలో సాంగ్ విడుదలైనా.. సోషల్ మీడియాలో హడావిడి కనిపించలేదు. విజయ్ విషయంలో పూరీజగన్నాథ్ తో చేస్తున్న సినిమా అప్ డేట్సే.. ఎక్కువ ఆకట్టుకుంటున్నాయి కానీ, వరల్డ్ ఫేమస్ లవర్ మాత్రం ఇంకా ఆ స్థాయి బజ్ తీసుకు రాలేకపోతోంది. దర్శకుడు క్రాంతి మాధవ్ టీమ్ చురుగ్గా లేదా, లేక విజయ్ నీరసపడిపోయారో తెలియదు కానీ.. లవర్స్ డే కి వస్తున్న లవ్ స్టోరీల్లో ఈ సినిమాకి మాత్రం కాస్త ఎట్రాక్షన్ తగ్గిందనే చెప్పాలి.
ఇంకా రెండు వారాలు టైమ్ మిగిలుంది. ఈలోగా విజయ్ దేవరకొండ రంగంలోకి దిగుతాడేమో చూడాలి.