ఈ మధ్యనే కార్తీ సినిమాలు రెండు వరసగా మెగాస్టార్ చిరంజీవి సినిమాల టైటిళ్లను వాడుకుంటూ విడుదల అయ్యాయి. ఖైదీ, దొంగ.. ఈ రెండు సినిమాలూ చిరంజీవికే సొంతం అనిపించుకున్నవి. ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు. ఆ రెండు టైటిళ్లతో వరసగా కార్తీ డబ్బింగ్ సినిమాలు తెలుగులో విడుదల అయ్యాయి. వాటిల్లో ఖైదీ సినిమా టైటిల్ కు ఎంతో కొంత న్యాయం చేయగా.. దొంగ మాత్రం అడ్రస్ లేకుండా పోయింది!
అలా చిరంజీవి సినిమా టైటిళ్లను అనువాద సినిమాలకు వాడటం కొనసాగుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు మరో సినిమా వస్తోంది. ఇదైతే చిరంజీవి టైటిళ్లను రెండింటిని వాడేస్తూ ఉంది. తమిళంలో జీవా హీరోగా రూపొందిన ఒక సినిమాను తెలుగులో స్టాలిన్ పేరుతో విడుదల చేస్తూ ఉన్నారట. చిరంజీవి స్టాలిన్ విడుదల అయ్యి దాదాపు 14 సంవత్సరాలు అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అదే టైటిల్ తో ఒక తమిళ సినిమా వస్తోంది. అంతే కాదట.. ఈ సినిమాకు అందరి వాడు అనే సబ్ టైటిల్ కూడా ఉంటుందట!
అందరివాడు, స్టాలిన్ సినిమాలు వరసగా విడుదల అయ్యాయి. ఇప్పుడు ఆ రెండు టైటిళ్లనూ వాడేస్తూ తమిళ అనువాద సినిమా వస్తున్నట్టుంది. తమ సినిమాల ప్రమోషన్ కు ఇలా చిరంజీవి సినిమాల టైటిళ్లను వాడుకుంటూ..మార్కెటింగ్ వ్యూహాలను అనుసరిస్తున్నట్టుగా ఉన్నారు అనువాదకులు!