ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సూటిగా ఓ ప్రశ్న సంధించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీపై శాంటిటీపై ఉద్యోగ సంఘ నాయకులు ప్రశ్నలు వేసిన నేపథ్యంలో… దానికి వారు తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని సజ్జల కోరారు.
పీఆర్సీపై నెలకున్న ప్రతిష్టంభనపై చర్చించేందుకు రావాలని ఉద్యోగ సంఘాల నాయకులకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ ఫోన్ చేసి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పరిధులు, నిర్ణయాధికారాలు ఏమితో తమకు తెలియదని, అందుకే తాము చర్చలకు వెళ్లేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. అలాగే పీఆర్సీ జీవోలను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చేదాకా ఎలాంటి చర్చలకు వెళ్లమని ఉద్యోగ సంఘాల నేతలు భీష్మించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీ శాంటిటీపై ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించడాన్ని ఇవాళ మీడియా ప్రతినిధులు సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించారు. ఇందుకు ఆయన స్పందిస్తూ అలా అనడమంటే ప్రతిష్టంభనను పెంచడమే అవుతుందన్నారు. ఇన్నాళ్లు ఏ శాంటిటీతో చర్చలు జరిపారని ఉద్యోగ సంఘాల నేతల్ని సజ్జల నిలదీశారు. ఉద్యోగుల సమస్యలపై కమిటీ మధ్యవర్తిత్వం వహిస్తుందని ఆయన అన్నారు.
పీఆర్సీపై అనుమానాలు ఉంటే కమిటీని అడిగి తెలుసుకోవచ్చన్నారు. అందుకోసమే తాము కమిటీ వేశామన్నారు. ఉద్యోగుల ప్రతినిధులు వస్తే చర్చిద్దామని భావించామన్నారు. ఉద్యోగులు పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. తాము అన్నివేళలా చర్చలకు సిద్ధంగానే ఉన్నట్టు సజ్జల వెల్లడించారు.
ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమే అని తెలిపారు. అలాగే ఉద్యోగులపై ప్రభుత్వం దుష్ప్రచారం చేయిస్తోందనే ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. అలా చేయాల్సిన పని తమకు లేదన్నారు.