బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఎట్టకేలకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో దివంగత వైఎస్సార్ ఫొటో వివాదాస్పదం కావడం గమనార్హం. జూపల్లి ఇంట్లో వైఎస్సార్ ఫొటో ఇప్పటికీ వుందని తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించడం వెనుక, ఆ పార్టీ అనుమానం బయటపడింది.
బీఆర్ఎస్ తనపై సస్పెన్షన్ వేటు వేసిన అనంతరం జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ ఫొటో తన ఇంట్లో వుండడాన్ని మంత్రి ప్రస్తావించడపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజరం నుంచి బయటికి వచ్చినట్టుందని జూపల్లి తెలిపారు. దొరల గడీ నుంచి బయటపడ్డాననన్నారు. ఇంత అరాచకం ఎన్నడూ చూడలేదన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ… మీ ఇంటికి వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో ఉందని కాసేపటి క్రితం విమర్శించారన్నారు.
వైఎస్సార్ ఫొటో ఆ రోజు, ఈ రోజు కూడా ఉందని జూపల్లి అంగీకరించారు. ఇదే సమయంలో కేసీఆర్ ఫొటో కూడా ఉందన్నారు. తన ఇంట్లో ఎవరి ఫొటో వుండాలో, వుండకూడదో చెప్పేవారా మీరా అని ఆయన నిలదీశారు. వైఎస్సార్ ఫొటో తన ఇంట్లో వుంటే తప్పేంటని జూపల్లి ప్రశ్నించారు. ప్రతి వ్యక్తిలో కొన్ని మంచి, కొన్ని చెడు వుండొచ్చన్నారు. ఆనాడు వైఎస్సార్ ముఖ్యమంత్రి అని జూపల్లి చెప్పుకొచ్చారు. సీఎంగా లేకపోతే ఫొటో తీసి పడేయాలా? అని ఆయన నిలదీశారు. మంత్రి తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కొల్లాపూర్ నియోజకవర్గం నుండి వరుసగా 5 సార్లు జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలోనూ, ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ మంత్రిగా పనిచేశారు. 2011, అక్టోబరు 30న కాంగ్రెస్‌ను వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. 2014లో గెలుపొంది కేసీఆర్ మంత్రివర్గంలో పని చేశారు. అయితే 2018లో ఓటమి ఆయన్ను రాజకీయంగా బలహీనపరిచింది.
జూపల్లిపై గెలిచిన కాంగ్రెస్ నాయకుడు బీరం హర్షవర్ధన్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. దీంతో క్రమంగా జూపల్లికి పొమ్మనకుండా పొగపెట్టారు. ప్రస్తుతం ఆయన్ను బీఆర్ఎస్ సాగనంపింది.