హీరో నిఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ టైమ్ లో హైదరాబాద్ శివార్లలోని ఓ రిసార్ట్ లో అతికొద్దిమంది సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. దీంతో అతడి ప్రేమ విషయాలేవీ బయటకు రాలేదు. ఎట్టకేలకు తన ప్రేమకథ బయటపెట్టాడు నిఖిల్. మరీ ముఖ్యంగా పల్లవికి ప్రపోజ్ చేసిన రోజు జరిగిన విషయాన్ని తలుచుకొని నవ్వుకున్నాడు.
పెళ్లి చేసుకుందామనే విషయాన్ని పల్లవికి చెప్పడం కోసం ఆమెను గోవాకు తీసుకెళ్లాడు నిఖిల్. అయితే ఆ విషయం ఆమెకు చెప్పలేదు. టిఫిన్ చేద్దామంటూ బయటకుతీసుకొచ్చి, అట్నుంచి అటు ఎయిర్ పోర్ట్ కు తీసుకెళ్లి గోవా విమానం ఎక్కించాడట. ఫ్రెండ్స్ కు చెప్పి గోవాలో ఏర్పాట్లు కూడా చేయించాడట.
అయితే గోవాలో దిగిన తర్వాత భారీ వర్షం. ప్రపోజ్ చేయడం కోసం చేసిన ఏర్పాట్లన్నీ గాలికి ఎగిరిపోయాయంట. చివరికి బీచ్ లో వేసిన ఓ చిన్న టెంట్ కూడా కూలిపోయిందట. దీంతో చేసేదేం లేక బీచ్ లో ఉన్న రాయి పైనే పల్లవికి తన మనసులో మాట చెప్పాడట. పెళ్లి చేసుకుంటావా అంటూ నిఖిల్ అడగడం, వెంటనే పల్లవి ఎస్ అని చెప్పడం చకచకా జరిగిపోయాయట.
అయితే అంతా బాగుంది కానీ సర్ ప్రైజ్ ప్లాన్ చేయడం వల్ల తను మంచి దుస్తులు వేసుకోలేకపోయానంటోంది పల్లవి. దీనికి నిఖిల్ కూడా కౌంటర్ ఇచ్చాడు. గోవాలో రోడ్డు పక్కన 50 రూపాయలు పెట్టి ఓ చెడ్డీ కొని, అది వేసుకొని ప్రపోజ్ చేశానని తెలిపాడు. ఫొటోల్లో తను వేసుకున్న నిక్కర్ ఖరీదు కేవలం 50 రూపాయలని చెప్పుకొచ్చాడు.
ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీళ్లిద్దరూ కలుసుకున్నారట. ఆ కామన్ ఫ్రెండ్ లవ్ వారం రోజుల్లో బ్రేకప్ అయిందట. ఆ టైమ్ లో అతడ్ని ఓదార్చే క్రమంలో నిఖిల్-పల్లవి బాగా దగ్గరయ్యారంట. అయితే అంతకంటే ముందు, పల్లవిని కలిసిన 2 గంటల్లోనే పెళ్లి చేసుకుందామా అని అడిగేశాడంట నిఖిల్.