ఆఖరి రెండు బంతులకు రెండు సిక్సులు కొట్టి మ్యాచ్ ను గెలిపించిన బ్యాట్స్ మన్ ఎవరైనా ఉన్నారా? అంతర్జాతీయ క్రికెట్ కు సంబంధించి ఇలాంటి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు డ్యాషింగ్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో టీ20లో రోహిత్ సూపర్ ఓవర్ లో ఆఖరి రెండు బంతులనూ సిక్సులుగా మలిచాడు.
ఇది వరకూ ఆఖరి బంతికి సిక్సును కొట్టి మ్యాచ్ లో తమ జట్టును విజేతగా నిలిపిన బ్యాట్స్ మన్లు చాలా మంది ఉన్నారు. చాలా కాలం పాటు అలాంటి రికార్డు పాక్ బ్యాట్స్ మన్ మియాందాద్ పేరిట ఉండేది. అయితే ఆ టీ20 శకం వచ్చాకా చాలా మంది హిట్టర్లు ఆఖరి బంతిని సిక్స్ గా పంపి తమ జట్టును విజేతగా నిలిపారు. ఆఖరి బంతికి ఆరు పరుగులు రావడం అనేది.. ఇప్పుడు చాలా సాధారణం అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో.. ఆఖరి రెండు బంతులనూ గాల్లోనే బౌండరీ లైన్ దాటించి తమ జట్టును విజేతగా నిలిపి రోహిత్ అత్యంత అరుదైన ఫీట్ ను సాధించాడు.
ఆద్యంతం ఆసక్తిదాయకంగా సాగింది ఈ సీరిస్ లోని మూడో టీ20. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 179 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభారంభం ఇచ్చినా.. మిడిల్ ఆర్డర్ ఆ ధాటిని కొనసాగించలేదు. అయితే ఆఖర్లో రన్స్ రావడంతో ఆ మాత్రం స్కోరును చేయగలిగారు.
ఇక బౌలింగ్ విభాగం, ఫీల్డింగ్ లలో టీమిండియా సత్తా చూపించలేకపోయింది. మనోళ్లు సరిగా ఆడలేదు అనడం కంటే.. న్యూజిలాండ్ స్కిప్పర్ విలియమ్సన్ అద్భుతంగా ఆడాడు అనడం కరెక్టేమో! భారత బౌలర్లను విలిమ్సన్ చీల్చి చెండాడాడు. ప్రత్యేకించి బుమ్రా బౌలింగ్ లో అయితే విలియమ్సన్ దూకుడుగా ఆడాడు. అలా ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించే దిశగా సాగాడు న్యూజిలాండ్ స్కిప్పర్. ఇక మ్యాచ్ అంతా అయిపోయింది.. చేయాల్సింది రెండు మూడు పరుగులే అనే దశలో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆఖరి ఓవర్లో విలిమ్సన్ ఔట్ కావడంతో.. అప్పటికి చేయాల్సింది రెండు పరుగులే అయినా మూడు బాల్స్ ఉన్నా.. న్యూజిలాండ్ మ్యాచ్ ను సొంతం చేసుకోలేకపోయింది. ఆఖరి బంతికి టేలర్ బౌల్డ్ కావడంతో.. మ్యాచ్ టై అయ్యింది. షమీ మ్యాచ్ ను టై చేసేంత మంచి బౌలింగ్ చేశాడు. మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది.
అక్కడ కూడా మళ్లీ విలియమ్సన్ తగులుకున్నాడు. గప్టిల్, విలియమ్సన్ లు కలిసి బుమ్రా వేసిన సూపర్ ఓవర్లో ఏకంగా 17 పరుగులు చేశారు. బదులుగా రోహిత్, రాహుల్ లు బరిలోకి దిగి దుమ్ముదులిపారు. ప్రత్యేకించి ఆఖరి రెండు బంతులకు పది పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో రెండు వరస సిక్సర్లతో మ్యాచ్ ను ముగించాడు రోహిత్! ఇది మ్యాచ్ కు సిసలైన హైలెట్ గా నిలుస్తూ ఉంది.