బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. నోరు తెరిస్తే రాజ్యాంగం అనే మాట తప్ప…మరో పదం బయటకు రాదు. మూడు రాజధానుల ఏర్పాటు విషయమైతేనేం, ఇప్పుడు శాసనమండలి రద్దు అంశమైతేనేం ఆయన ‘రాజ్యాంగబద్ధం’గానే అన్నీ జరిగిపోతాయని సెలవిస్తున్నాడు. దీంతో టీడీపీకి విపరీతమైన కోపం వస్తోంది. అయినా ఏమీ మాట్లాడలేని నిస్సహాయ స్థితి. ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. దీనిపై జీవీఎల్ బుధవారం మీడియాతో మాట్లాడారు.
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో మండలి రద్దుకు సంబంధించి తీర్మానం చేసింది. ఇది రాజ్యాంగబద్ధంగానే జరిగింది. ఒక అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రం అడ్డు చెప్పే పరిస్థితి ఉండదు. కానీ కొందరు కేంద్రం అడ్డుకుంటోందని దుష్ప్రచారం చేస్తోంది. అందులో నిజం లేదు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచనలు మాత్రమే చేస్తుందని, అంతిమ నిర్ణయం పార్లమెంట్ మాత్రమే తీసుకుంటుంది’ అని స్పష్టం చేశాడు.
‘మండలి రద్దు విషయంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన కేంద్రానికి ఏ మాత్రం లేదు. అంతే కాదు మండలి రద్దు అంశాన్ని కేంద్రం రాజకీయ కోణంలో చూడటం లేదు. రాజ్యాంగం ప్రకారమే రద్దు ప్రక్రియను ముందుకు తీసుకెళతాం. ఆలస్యం లేదా త్వరగా పూర్తి చేయడమనేవి ఉండవు. రాజ్యాంగానికి లోబడి నిర్ణయాలు ఉంటాయి. 169 (1) ప్రకారం అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన దాన్ని మేము చేసేదేమీ ఉండదు’ అని జీవీఎల్ కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేశాడు.
మూడు రాజధానుల ఏర్పాటుపై కూడా జీవీఎల్ కేంద్రం వైఖరిని చెప్పాడు. రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలోని అంశమని, దాంట్లో కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేదని వారం క్రితం ఆయన తేల్చి చెప్పి, రాష్ట్ర బీజేపీ, జనసేన నేతల నోళ్లు మూయించారు. ఈ సందర్భంగా కూడా ఆయన రాజ్యాంగాన్ని ముందుకు తెచ్చి….తనదైన శైలిలో పలు ఇంటర్వ్యూల్లో కేంద్రం ఉద్దేశాన్ని స్పష్టపరిచాడు.
జీవీఎల్ వివరణతో ఏపీలో బీజేపీ నేతలు సుజనాచౌదరి, కన్నా లక్ష్మినారాయణ, జనసేనాని పవన్‌కల్యాణ్ తదితర నాయకులు నోరెత్తకుండా చేశాడు. వీరే కాకుండా రాజధానుల ఏర్పాటును కేంద్రం అడ్డుకుంటుందని చెబుతున్న టీడీపీ ఆశలపై కూడా ఆయన నీళ్లు చల్లారు. ఏది ఏమైనా ఇటు టీడీపీ, అటు మీడియా నోళ్లను కూడా జీవీఎల్ చాలా తెలివిగా రాజ్యాంగం అనే ఆయుధంతో మూయిస్తున్నారు. దీంతో జీవీఎల్ మాటలు ఎల్లో మీడియాకు, ప్రతిపక్ష టీడీపీ, జనసేన తదితర పార్టీల నాయకులకు రుచించడం లేదు.