వైసీపీలో కొడాలి ఒంటరి అయ్యారా?

సీఎం జగన్ పై ఎవరైనా పల్లెత్తు మాట అంటే విరుచుకుపడిపోయే బ్యాచ్ లో మొదటగా వినిపించే పేరు కొడాలి నాని. మరి కొడాలిపై విమర్శలు వస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా..? చేశారా..? కనీసం వైసీపీ…

సీఎం జగన్ పై ఎవరైనా పల్లెత్తు మాట అంటే విరుచుకుపడిపోయే బ్యాచ్ లో మొదటగా వినిపించే పేరు కొడాలి నాని. మరి కొడాలిపై విమర్శలు వస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా..? చేశారా..? కనీసం వైసీపీ నుంచి ఓ ఖండన ప్రకటన అయినా వెలువడిందా..? వైసీపీలో కొడాలి నాని ఒంటరి అయ్యారా..?

సంక్రాంతికి గుడివాడలో క్యాసినోలు పెట్టారు, గోవా కల్చర్ తెచ్చారు అనే వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ఉన్న వ్యక్తులు, బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తున్న పాటలు, పైన వైసీపీ రంగులతో కట్టిన పరదాలు.. ఇవన్నీ కొడాలి నానిని టార్గెట్ చేసేలా ఉన్నాయి. 

నాయకుడి పేరు చెప్పి అభిమానులు ఏదైనా ఆవేశ పడితే దానికి ఆ నాయకుడ్ని బాధ్యుడ్ని చేయలేం. ఇక్కడ నాని కూడా ఇలాగే ఇరుక్కుపోయారు. దీంతో ప్రతిపక్షాలు రెచ్చిపోయాయి. అసలు సంక్రాంతి రోజు, క్యాసినో జరిగింది అని చెబుతున్న రోజు తాను గుడివాడలోనే లేనని, ఆస్పత్రిలో ఉన్నానని ఆయన మొత్తుకుంటున్నా కూడా వినడం లేదు.

గుడివాడలో చీమ చిటుక్కుమన్నా కొడాలిదే బాధ్యత అంటూ టీడీపీ ఏకంగా నిజ నిర్థారణ కమిటీ పేరుతో రాద్ధాంతం చేసింది, చేస్తోంది కూడా. టీడీపీవి కుయుక్తులు అని కొట్టిపారేసినా.. వైరి వర్గం కాబట్టి, అవకాశం దొరికింది కాబట్టి గుడివాడ ఇష్యూని వారు అంత తేలిగ్గా వదిలిపెడతారని అనుకోలేం. మరి దానికి కౌంటర్ గా వైసీపీ ఏం చేసిందనేదే అసలు ప్రశ్న.

ఏపీలో నాకు తెలిసిన నాని ఒక్కరే, ఆయనే కొడాలి నాని అంటూ.. ఆమధ్య సినీ హీరో నానిపై సెటైర్లు పేల్చిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా.. క్యాసినో విషయంలో కొడాలికి మద్దతుగా మాట్లాడలేదు. అంతెందుకు మంత్రుల్లో ఒక్క వెల్లంపల్లి శ్రీనివాస్ మినహా ఇంకెవరూ కొడాలికి మద్దతుగా కనీసం ఓ స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొడాలి విషయంలో తమకెందుకులే అని సైలెంట్ అయిపోయారా..? లేక హైకమాండ్ నుంచి ఏవైనా ఆదేశాలు వచ్చాయా.. వారికే తెలియాలి.

ఇప్పటి వరకూ వైసీపీలో ఏ మంత్రిపై కూడా ఇంత తీవ్రమైన అరోపణలు రాలేదు, ఒకవేళ వచ్చినా అవన్నీ పూర్తిగా ఫ్యాబ్రికేడెట్ అని తేలిపోయింది. ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను అడ్డుపెట్టుకుని వైరి వర్గం రెచ్చిపోతోంది. పైగా కొడాలి నాని కూడా సహనం కోల్పోయారు, టీడీపీ బ్యాచ్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ని గతంలో కంటే ఎక్కువగా ఉతికి ఆరేస్తున్నారు.

ఈ టైమ్ లో కూడా వైసీపీ నుంచి మద్దతు ఎందుకు కరవైందనేదే అనుమానాస్పదంగా మారింది. నాని అంటే గిట్టని వాళ్లే వైసీపీలో ఎక్కువగా ఉన్నారా అనే అనుమానాలు పొడసూపుతున్నాయి. మొత్తమ్మీద సీఎం జగన్ పై ఈగ వాలనీయకుండా చూసుకున్న కొడాలి నాని.. తనదాకా వచ్చే సరికి మాత్రం ఒంటరిగా మిగిలారు.