మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నయా ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. ఆయన ఇదివరకూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు. ఇపుడు అలా కాదు, హ్యాపీగా ఇంట్లోనే కూర్చుని ప్రతీ రోజూ వీడియోలు చేస్తూ ఆ క్లిప్స్ ని క్షణాల్లోనే బయటకు వదిలేస్తున్నారు. ఈ మధ్యనే ఆయన తనయుడు విజయ్ కూడా ఒక చానల్ ఇంటర్వ్యూలో టెక్నికల్ గా మా నాన్న బాగా అప్ డేట్ అయ్యారని మురిసిపోయారు కూడా.
సరే అదలా ఉంచితే ప్రతీ రోజూ ఉదయాన్నే ఒక వీడియో చేయడం దాంట్లో ఏపీ సీఎం జగన్ని తుగ్లక్ అంటూ విమర్శలు చేయడం అయ్యన్నకు అలవాటుగా మారిందని వైసీపీ నేతలు మండిపడుతునారు. అధికారం పోయాక అయ్యన్న మానసిక స్థితి బాగాలేకనే ఇలా జగన్ని విమర్శిస్తూ శాడిస్టిక్ ఆనందాన్ని పొందుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ అంటున్నారు.
అయ్యన్న వైసీపీని విమర్సించడం కాదు, టీడీపీకి, చంద్రబాబుకు, అయ్యన్నకు ఖర్మ కాలితేనే ఏపీ జనాలు 2019 ఎన్నికల్లో ఓడించారు, వీళ్ళను పూర్తిగా ఇంటికి పంపించారు అని గుర్తు పెట్టుకోవాలని గణేష్ భలే పంచులేశారు. అయ్యన్న స్థాయిల గురించి మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రిని అనే స్థాయి అసలు మీకుందా అని గణేష్ సూటిగానే నిలదీస్తున్నారు.
ఇక నర్శీపట్నంలో లాటరైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చిని, కోట్ల రూపాయలు దాకా అక్రమంగా వెనకేసుకుంది తెలుగుదేశం నాయకులే అన్న సంగతి మరచిపోతే ఎలా అయ్యన్నా అని గణేష్ ప్రశ్నించారు.
అవినీతి గురించి, దోపిడీ గురించి మాట్లాడే నైతిక హక్కు అయ్యన్నకు లేదని, ఏపీని అడ్డగోలుగా అయిదేళ్ళు దోచుకున్న టీడీపీ నేతలు నీతి వాక్యాలు చెప్పడమేంటని కూడా గణేష్ అంటున్నారు. అయ్యన్న తీరు మార్చుకోకపోతే తాము కూడా ఆయన నోటి దురుసుకు అదే తీరున బుద్ధి చెబుతామని గణేష్ హెచ్చరించడమే కొసమెరుపు.
మొత్తానికి జగన్ని అన్నానని అయ్యన్న ఆనందపడేలోపే వైసీపీ ఎమ్మెల్యే గణేష్ మొత్తానికి మొత్తం విషయాలు తవ్వి తీసి అయ్యన్నను తూర్పారా పడడంతో సీనియర్ టీడీపీ నేతకు మింగుడుపడడంలేదని అంటున్నారు. మరి అయ్యన్న వర్సెస్ వైసీపీ మాటల యుద్ధం ఆగుతుందా అలాగే సాగుతుందా అన్నది చూడాల్సిందే.