ఏపీలో స్థానిక ఎన్నికల్లో తాము జాయింటుగా పోటీ చేయనున్నట్టుగా ప్రకటించాయి భారతీయ జనతా పార్టీ, జనసేనలు. ఇటీవలే రెండు పార్టీలూ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలే ఈ రెండు పార్టీలకూ జాయింటు వెంచరని స్పష్టం అవుతోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ లోక్ సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీని విమర్శించారు. బీజేపీతో చేతులు కలిపే పరిస్థితే లేదని అప్పట్లో ప్రకటించారు. అయితే ఎన్నికలు అయిపోయిన ఆరు నెలలు గడిచేసరికి పవన్ టోన్ మారింది. బీజేపీకి దగ్గరయిపోయారు. దీని కోసం ఇప్పటికే పలు ఢిల్లీ టూర్లు చేశారు.
ఇక ఎన్నికల నాటికీ, ఇప్పటికీ జనసేన పరిస్థితి ఏం మెరుగయ్యిందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఎన్నికల నాటికి.. జనసేన మీద ఏవో తెలిసీ తెలియని అంచనాలతో అయినా కొంతమంది పని చేశారు. సార్వత్రిక ఎన్నికలతో జనసేన సత్తా ఏమిటో అందరికీ క్లారిటీ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో జనసేన తరఫున క్యాడర్ ఏ మేరకు పని చేస్తుందో కూడా చూడాల్సి ఉంది.
ఇక మూడు రాజధానుల ఫార్ములాకు వ్యతిరేకం అని పవన్ ప్రకటించాకా.. ఉత్తరాంధ్రలో ఆ పార్టీకి కాస్తో కూస్తో ఉన్న ఫాలోయింగ్ కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. రాయలసీమలో జనసేనకు జెండా కట్టే వాళ్లు కూడా కనిపించడం లేదు. ఇక భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందనే మాటే కానీ.. రాష్ట్రానికి పాటు పడింది మాత్రం శూన్యం. ఈ నేపథ్యంలో ఈ ఇరు పార్టీలూ స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నట్టుగా ప్రకటించాయి. తమ కలయిక కొత్త రాజకీయాలకు నాంది అని జనసేన అధినేత ప్రకటించారు. మరి అదెలా ఉంటుందో.. స్థానిక ఎన్నికలతో కొంత స్పష్టత రాబోతున్నట్టే!