ముఖ్యమంత్రి జగన్ అనుకున్న విధంగానే ముందుకు సాగుతున్నారు. విశాఖను పాలనారాజధాని చేస్తామని చెప్పిన సీఎం ఆ దిశగానే వేగంగా అడుగులు వేస్తున్నారు. తెలుగు వారికి కొత్త ఏడాదిగా భావించే ఉగాది నుంచి విశాఖలో ముఖ్యమంత్రి జగన్ కార్యకలాపాలు ప్రారంభిస్తారని తెలుస్తోంది.
విశాఖలోనే ముఖ్యమంత్రి నివాసంతో పాటు, ఆయన కార్యాలయం కూడా ఉంటాయి. ఈ మేరకు దానికి సంబంధించిన పనులు చకచకా సాగిపోతున్నాయి. నిండు అసెంబ్లీలో జగన్ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తుంచుకుంటే చాలు. సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని, అక్కడే పరిపాలన.
దాంతో విశాఖను పాలనారాజధానిగా చేసుకుని ఉగాది నుంచి జగన్ ఇక్కడికి షిఫ్ట్ అవుతారని అధికార పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న మాట.
ఇక మూడు రాజధానులు, పాలన వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లులు శాసనమండలిలో ఉన్నా కూడా జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయి. దీనిపైన న్యాయ సలహాలు కూడా తీసుకుంటున్న జగన్ విశాఖ రాజధాని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గరని అంటున్నారు.
ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డి కూడా గట్టిగానే చెప్పారు. విశాఖ రాజధాని అవడం ఖాయమని, కాకపోతే కొంత లేట్ అవుతుందని ఆయన అంటున్నారు.
ఇక విశాఖ నుంచే పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలని జగన్ నిర్ణయించారు. ఉగాది వేళ ఈ కార్యక్రమానికి విశాఖలో శ్రీకారం చుట్టడం ద్వారా పాలనా రాజధానిని అలా అనధికారికంగా ప్రకటించేస్తారన్న మాట.