తనను జైల్లో రేప్ చేశారంటూ కొత్త ఆరోపణ చేస్తూ ఉన్నాడు నిర్భయ హంతకుల్లో ఒకడైన ముఖేష్ సింగ్. ఎటు తిరిగీ ఎలాగోలా ఉరి శిక్షను తప్పించుకోవాలని తెగ తాపత్రపడుతూ ఉన్నాడు ఈ ముఖేష్ సింగ్ అనే కిరాతకుడు. నిర్భయను అత్యాచారం చేయడంతో పాటు.. అత్యంత దారుణంగా హత్య చేసిన వారిలో వీడు ఒకడు. ఆమెపై ఘాతుకానికి పాల్పడినప్పుడు ఎంతగా అర్థించి ఉంటుందో వీడికే తెలియాలి. ఇప్పుడు వీడు అనేక అవకాశాలను ఉపయోగించుకుని తనకు పడిన శిక్షను తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే రాష్ట్రపతి మీద కూడా సుప్రీం కోర్టుకు కంప్లైంట్ చేస్తున్నాడు.
వీడికి తోడు వీడి లాయర్ మరింత టక్కరిలా ఉన్నాడు. ఇప్పటికే ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించారు. అత్యంత కిరాతకానికి పాల్పడిన అతడికి ఉరే సరి అని రాష్ట్రపతి తేల్చారు. అయితే తన పిటిషన్ విషయంలో రాష్ట్రపతి మనసు పెట్టి ఆలోచించలేదని కొత్త వాదనతో సుప్రీంను ఆశ్రయించాడు ముఖేష్ సింగ్. అతడి లాయర్ ఇదే వాదన వినిపించాడు. అయితే రాష్ట్రపతి ఎలా ఆలోచించాడో మీరెలా చెప్పగలరు? అని కోర్టు ఎదురు ప్రశ్నించింది.
ఇక జైల్లో తను అనుభవించిన కష్టాల గురించి కూడా ముఖేష్ సింగ్ ఇప్పుడు కోర్టుకు చెప్పాడు. తనను జైల్లో రేప్ చేశాడని ఇతడు కోర్టుకు నివేదించాడు. జైల్లో తన సహచర ఖైదీ ఒకరు తనను రేప్ చేశాడని, బలవంతంగా సెక్స్ లో పాల్గొనమని ఒత్తిడి చేశాడని ముఖేష్ సింగ్ ఆరోపించాడు. జైల్లో చిత్రవధ అనుభవించినట్టుగా చెప్పాడు. అయితే జైల్లో కష్టాలకూ క్షమాభిక్షకు సంబంధం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొన్నాడు. ఈ రోజు ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పును ఇవ్వనుంది. మరోవైపు నిర్భయ హంతకులకు ఉరి శిక్ష అమలుకు తీహార్ లో అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయని సమాచారం.