రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాని సమయంలో ప్రత్యర్థిపై ఏదో రకంగా బురదజల్లి, దాన్ని తన అనుకూల మీడియాతో చిలవలు పలువలు చేసి ప్రచారం చేయించడం నారా వారికి వెన్నతో పెట్టిన విద్య. బాబు పెంచి పోషించిన ఈ సంస్కృతిని చినబాబు బాగానే వంటబట్టించుకున్నారు. రెండు రోజుల నుంచి తండ్రీకొడుకులిద్దరూ వైఎస్ఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటూ నోరుపారేసుకుంటున్నారు.
ఏకంగా తండ్రి వైఎస్ఆర్ నే జగన్ కొట్టారని, ఆ విషయం విజయమ్మకు కూడా తెలుసని, రోశయ్య కూడా సాక్ష్యమంటూ చంద్రబాబు కట్టుకథలల్లుతుంటే, జగన్ ని సీఎం చేసేందుకే వైఎస్ వివేకా హత్య జరిగిందని మరో దారుణమైన కుట్ర కథ ప్రచారంలోకి తెస్తున్నారు చినబాబు. వైసీపీ నేతలు ఈ దుష్ప్రచారాలపై కాస్త గట్టిగానే బదులు చెబుతున్నా.. టీడీపీ అనుకూల మీడియా తమ నేతల మాటల్ని పదే పదే ప్రసారం చేస్తూ విషం కక్కుతోంది.
మండలిని రద్దుచేశారన్న అక్కసుతోనే.. ఉన్నట్టుండి ఇలాంటి పుకార్లన్నిటికీ బీజం వేస్తున్నారు చంద్రబాబు-లోకేష్. గతంలో విశాఖను రాజధానిగా ప్రకటించిన సమయంలో కూడా.. విజయమ్మ విశాఖలో పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ హేళనగా మాట్లాడారు టీడీపీ నేతలు, ఇప్పుడు కూడా అదే దుష్ట సంప్రదాయాన్ని తెరపైకి తెచ్చారు.
ఫలహారాల కోసం ఎయిర్ పోర్ట్ లో ఖర్చుల లెక్కలు చూపిస్తేనే సాక్షిపై 75 కోట్లకు పరువునష్టం దావా వేసిన లోకేష్, ఇప్పుడు జగన్ పై చేసిన నిరాధార ఆరోపణకు ఎన్నికోట్లు కట్టాలి. “జగన్ ని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా వైఎస్ వివేకా హత్య జరిగింది. వివేకా హత్యని జగన్ రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు. జగన్ శవరాజకీయం, వైఎస్ కుటుంబ సభ్యులకు అర్థమైంది”. అంటూ వరుసగా ట్వీట్ల వర్షం కురిపించారు చినబాబు.
ఏకంగా సీఎంను టార్గెట్ చేసుకుని, ఎలాంటి ఆధారాలు లేని నిందలు వేసిన లోకేష్ ని ఏం చేయాలి? అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలా వద్దా?. పరువునష్టం కేసు వేయాలా వద్దా?.. కేవలం ప్రభుత్వాన్ని, వైఎస్ కుటుంబాన్ని రెచ్చగొట్టడానికే పచ్చబ్యాచ్ ఇలాంటి కుటిల పన్నాగాలు పన్నుతోందనే విషయం స్పష్టమౌతూనే ఉంది.