జనసేనాని పవన్‌కల్యాణ్‌ను ఓటమి భయం వెంటాడుతోంది. జనసేన అధికారంలోకి రావడం కథ దేవుడెరుగు. కనీసం ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కూడా ఇంత వరకూ గెలవలేని దుస్థితి. పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా అసెంబ్లీలో అడుగు పెట్టని అధ్యక్షుడు బహుశా దేశ చరిత్రలో ఒకే ఒక్కడు పవన్‌కల్యాణ్ అయ్యి వుంటారు. 2014లో జనసేన స్థాపించినప్పటికీ, అప్పట్లో ఆయన టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు.
అప్పుడు జగన్‌ను అధికారంలోకి రానివ్వకూడదనే పోటీ చేయలేదని పవన్ బహిరంగంగానే ప్రకటించారు. 2019కు వచ్చే సరికి మళ్లీ జగన్‌కు రాజకీయ లబ్ధి కలగకుండా ఉండేందుకు… ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే కుట్రకు పవన్ తెరలేపారు. చంద్రబాబు పల్లకీ మోయడానికి పవన్ వేసిన ఎత్తుగడలను పసిగట్టిన జనం కర్రు కాల్చి వాత పెట్టారు. చివరికి పవన్ నిలిచిన రెండు చోట్లా ఓడించారు. ఈ పరిణామాల్ని పవన్ అసలు ఊహించలేదు.
దీంతో 2024 ఎన్నికల్లో తానెక్కడ నిలిచేది బహిరంగ పరచలేదు. ఇదేమని ప్రశ్నిస్తే…ఆశ దోశ అప్పడం అంటూ జనసేన నేతలు చెబుతున్నారు. పవన్‌కల్యాణ్‌ను ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి వైసీపీ వెనుకాడదని జనసేన నేతలు అంటున్నారు. అలాగే ఫలానా నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేస్తారని ప్రకటిస్తే, అక్కడ జనసేనను పూర్తిగా విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ పాల్పడుతుందని, అందుకే పవన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
జగన్‌ను గద్దె దించుతానని ప్రగల్భాలు పలుకుతున్న పవన్… తన గెలుపుపై ఎంత భయాందోళనలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నాయకుడు రాజకీయాలు ఏం చేస్తారనే ప్రశ్న వెల్లువెత్తుతోంది. రాజకీయ నాయకుడి మొదటి ఓటమి భయమే అనడంలో అతిశయోక్తి లేదు. అదే పవన్‌ను రాజకీయంగా ఎదగనీయకుండా చూస్తుందన్న ప్రచారంలో నిజం వుంది.
ఇందుకు నిలువెత్తు నిదర్శనం…ఇంత వరకూ తనకంటూ ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోకపోవడం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.