కొడవలి లాంటి నాలుకతో కొడాలి నాని

తప్పులు జరగడం సహజం. వాటిని దిద్దుకోవడానికి మార్గాలుంటాయి. Advertisement తప్పు జరిగినప్పుడు ఒప్పేసుకుంటే కథ అక్కడితో సుఖాంతమవుతుంది. చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకొమ్మని కూడా కోరితే మరింత హుందాగా ఉంటుంది. తర్వాత చట్టమేం చేసిందనేది…

తప్పులు జరగడం సహజం. వాటిని దిద్దుకోవడానికి మార్గాలుంటాయి.

తప్పు జరిగినప్పుడు ఒప్పేసుకుంటే కథ అక్కడితో సుఖాంతమవుతుంది. చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకొమ్మని కూడా కోరితే మరింత హుందాగా ఉంటుంది. తర్వాత చట్టమేం చేసిందనేది కూడా ప్రతిపక్షాలు పట్టించుకున్నా జనం పట్టించుకోరు.

ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు దేవుళ్లు. తప్పు ఒప్పేసుకుంటే క్షమించేసే గుణం వాళ్లల్లో ఉంటుంది.

ఉదాహరణకి మొన్నటికి మొన్న సుబ్బారావు గుప్తా అనే వ్యక్తిపై దాడి జరిగిన వెంటనే ప్రతిపక్షం దానిని రాజకీయం చేసే ప్రయత్నం చేసింది. కానీ ఆ మర్నాడే బాలినేని సీన్లోకి వచ్చి జరిగిన తప్పుకి బాధ్యత వహించి నిప్పు రాజుకోకుండా నీళ్లు జల్లేసి సుబ్బారావుకి కేకు తినిపించి శుభం కార్డేసేసారు. దాంతో చేసేది లేక ప్రతిపక్షాలు కూడా నోళ్లు మూసేసుకున్నాయి.

ఇప్పుడు కోడాలి నాని సొంత కళ్యాణమండపంలో చట్టవిరుద్ధంగా క్యాసినో నడిపారని పండగ వేళనుంచీ మండుతున్న వార్త.

ఆ సమయంలో నాని .. కరోనా సోకి తాను నియోజకవర్గంలో లేనందువల్ల తనకు తెలియకుండా జరిగుండొచ్చని చెప్పి, దర్యాప్తుకు సహకరిస్తానని, ఒకవేళ నిజంగా లాంటిది జరిగుంటే తాను చట్టానికి లోబడి ఉంటానని ప్రకటించి, ఏ మీడియావాడు మైకు పెట్టినా ఇదే చెప్పుంటే సరిపోయేది.

యుద్ధంలో కత్తి దూసేటప్పుడు దూయాలి, డాలు అడ్డుపెట్టుకునేటప్పుడు పెట్టుకోవాలి. అంతే తప్ప అసలు డాలే అక్కర్లేదని పక్కన పడేసి అన్ని సార్లూ కత్తే దూస్తానంటే ఒంటి మీద గాట్లు తప్పవు.

ఇప్పుడు కొడాలి నానికి అదే జరుగుతోంది. ఆత్మరక్షణ చేసుకోవాల్సిన సమయంలో తనదైన శైలిలో నాలుక అనే అతి పదునైన కత్తిని దూస్తున్నారు.

ఎక్కడో జరిగిన వేడుకలని వీడియోలుగా పెట్టి అవి తన ఇలాకాలో జరిగినట్టు తెదేపా వాళ్లు ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు.

ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి.

ఏ పరిస్థితుల్లోంచైనా చట్టపరంగా బయటపడిపోవచ్చు. ఆధారాలు సరిగ్గా లేకపోతే ఏ కేసూ నిలవదన్న సంగతి అందరికీ తెలుసు.

అది సామాన్యుడికైతే ఓకే. కానీ రాజకీయనాయకుడి గమనం అలా ఉండకూడదు.

తప్పు జరిగితే మీదేసుకుని నైతిక బాధ్యత వహిస్తూ అవసరమైతే జైలు గుమ్మం కూడా తొక్కేయాలి. అప్పుడే సింపతీ, రెస్పెక్ట్ రెండూ వస్తాయి. ఆ తెగువ ఉండాలి.

అలాంటి వాడికి జనం గుండెల్లో గుడి కాదు కోట కట్టేస్తారు. నిఖార్సైన నిజాయితీని చాటుకునే అవకాశమంటే ఇదే.

“ఎక్కడ తప్పు జరిగినా ఉపేక్షించడు. ఆఖరికి తన మనుషులు తప్పు చేసినా వారిని కూడా చట్ట పరిధిలోకి లాగుతాడు. పొరపాటున తన ప్రమేయం లేకుండా తన మనుషుల వల్ల ఏ తప్పైనా జరిగితే తాను కూడా నైతిక బాధ్యత వహించి చట్టపరంగా శిక్ష వేయించుకుంటాడు” అనే గొప్ప పేరు దక్కుతుంది.

ఈ సూత్రం తెలుసుకోకుండా ఎంతసేపూ బండయుద్ధం చేస్తానంటే ఎలా?

తన కల్యాణమండపంలో క్యాసినో జరిగినట్టు ఆధారాలునున్నాయట, తెదేపావాళ్లు నిరూపిస్తారట అంటే, “చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతోంది. నేను నిరూపిస్తాను. పదండి నాతో” అని ఒక టీవీ విలేకరితో అన్నారు మంత్రి కొడాలి నాని.

ఇది వైసీపీ సానుభూతిపరులకి, ఏం జరిగినా కొడాలి నానికి కొమ్ముకాయాలనుకునే వీరాభిమానులకి చప్పట్లు కొట్టే డయలాగ్ కావొచ్చేమో గానీ, మిగిలిన జనాభాకి ఇది గుండెల్లో ఎక్కడో గుచ్చుకునే మాట. “ఇంట్లో వ్యభిచారం” అనే ఆరోపణ చాలా పెద్దది. చంద్రబాబు మీద రాజకీయంగా ఇష్టత లేనివాళ్లకి కూడా అంత పెద్ద మాట అవసరమా అనిపిస్తుంది.

అసలే ఇన్నాళ్లూ “చంద్రబాబు ఆడవాళ్లని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో ఎదిగాడు. ఒక ఆడదాన్ని బూచిగా చూపించి మామకి వెన్నుపోటు పొడిచాడు.  ఇంకో ఆడదాన్ని వాడుకుని సైకిల్ గుర్తు తెచ్చుకున్నాడు. భార్యని కూడా రోడ్డుకీడ్చి ఏడుస్తూ సింపతీ కొట్టే ప్రయత్నం చేసాడు” అంటూ పలు రకాలుగా కొడాలి తన కొడవలి లాంటి మాటలతో చంద్రబాబు మీద దాడి చేస్తూనే ఉండడం చూస్తున్నారు ప్రజలు. ఇవన్నీ చాలవన్నట్టు “ఇంట్లో వ్యభిచారం” అనే మాట వినడానికే ఘోరంగా ఉంది.

తెలిసో తెలియకో జరిగిన తప్పుని కేవలం చట్టపరంగానే కాదు, నైతికంగా కూడా కొట్టివేయించుకోగలగాలి.

వీడియో సాక్ష్యాలున్నప్పుడు అది చాలా కష్టం.

అయితే కొడాలి నాని మాత్రం, “నా కల్యాణమండపం ఓపెన్ ఎయిర్ కాదు. నా కల్యాణమండపం సైజెంతో కూడా ఈ పుకారు పుట్టించినవాళ్లకి తెలియదు. విడుదలైన వీడియోల్లో టెంటు మధ్యలోంచి చందమామ కూడా కనిపిస్తోంది. అంటే అది ఎక్కడో ఓపెన్ ఎయిర్ లో వేసిన పందిరి. ఇందాకటి వరకు నా కల్యాణమండపంలో జరిగిందని చెప్పిన పచ్చ మీడియా ఇప్పుడే “కల్యాణమండపం సమీపంలో” అని కొత్తగా మార్చింది. నేనిప్పటికీ కట్టుబడి ఉన్నా. నా కల్యాణమండపంలో ఎటువంటి క్యాసినో కూడా జరగలేదు” అని నొక్కివక్కాణిస్తున్నారు.

నిజానిజాలు గుడివాడ ప్రజలకే తెలియాలి. ఎందుకంటే కొడాలి నాని కళ్యాణమండపం ఎలా ఉంటుందో బయటి ప్రజలకు తెలియదు. గుడివాడ ప్రజలు ఇబ్బంది పడనంతవరకూ కొడాలి నాని కీర్తికి మచ్చ రాదు. ఆశ్చర్యకరంగా ఇంతవరకూ ఏ గుడివాడ వాసి కూడా నిజానిజాలు చెబుతూ ఒక్క వీడియో కూడా విడుదల చెయ్యలేదు.

శ్రీనివాసమూర్తి