కాబోయే టీడీపీ రథసారథి నారా లోకేశ్‌పై ఆయన అభిమానులు రూపొందించిన పాట జనరంజకంగా లేదు. ఆ పాట వింటుంటే ఊపు తెప్పించేలా లేదు. గతంలో జగన్‌పై వచ్చిన పాటలు ఒక ఊపు ఊపాయి. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రాయలసీమ ముద్దుబిడ్డ, మా జగనన్న అంటూ ప్రముఖ సింగర్ మంగ్లీ పాడిన ఆ పాట కోట్లాది మంది ప్రజల మనసులను గెలుచుకుంది.
తాజాగా టీడీపీ యువకిశోరం నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన టీం పాటను తెరకెక్కించింది. ఈ పాట వింటుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందమనిపించింది.
” ఆంధ్రులంతా ఒక్కటాయ లోకేశ్ అన్న పయనంలో. శుభము నీకు పలకనయ్య మూడు కోట్ల దేవతలు. అలుపెరగని సైనికా, బెదురులేని నాయకా…తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి నువ్వు ప్రతీక… లోకేశ్ అన్నా లోకేశ్ అన్నా. పేద ప్రజలకు అండగా అభయం ఇచ్చినావుగా, ఆంధ్రప్రదేశ్ అమ్మకు నువ్వు తెలుగుదేశం బిడ్డగా, చంద్రబాబు ఆశయాల సారథి అయ్యావుగా..హ్యాపీ బర్త్ డే నారా లోకేశ్ అన్నా” అంటూ పాట సాగింది.
వైఎస్ జగన్‌పై పాటలు హిట్ కావడానికి, లోకేశ్‌పై ఫెయిల్యూర్ కావడానికి తేడా ఏంటంటే… వాళ్ల జీవితాలే కారణం. జగన్ జీవితంలో అనేక కోణాలున్నాయి. జగన్‌పై ప్రజల ప్రేమ, రాజకీయ, ఎల్లో మీడియా వేధింపులు, వాటిని తట్టుకుని నిలబడగలిగిన దమ్ము, వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేయగలిగిన మానసిక దృఢత్వం… ఎన్ని కష్టాలొచ్చినా లెక్కచేయని మనోధైర్యం జగన్‌కు ప్రత్యేక గుర్తింపు, గౌరవం తెచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. జగన్ అంటే ప్లవర్ కాదు, ఫైర్.
ఇదే లోకేశ్ విషయానికి వస్తే రాజకీయ జీవితం వడ్డించిన విస్తరి. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండానే తండ్రి కేబినెట్‌లో మంత్రి అయ్యారు. అన్నీ తానై పెత్తనం చెలాయించారు. అలాంటప్పుడు లోకేశ్ గురించి పాటలో తప్ప ఆచరణలో చెప్పుకోడానికి ఏముంది?.
లోకేశ్ అంటే…ప్లవరే. ఆయన జీవితంలో ఇంత వరకూ ఫైర్ లేదు. అందుకే లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు ఆవిష్కరించిన రథసారథి పాట వారికి తప్ప జనానికి నచ్చడం లేదు. ఇందుకు నిదర్శనం ఆ పాటకు వస్తున్న వ్యూసే నిదర్శనం.