నిర్మాతగా తన సినిమా జీవితాన్ని పెళ్లి చూపులు సమూలంగా మార్చిందని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. తనకు అవార్డులు, డబ్బులు తెచ్చిందని, తనకు నిర్మాతగా ఓ విజిటింగ్ కార్డుగా మారిందని అన్నారు. ఆ సినిమా తరువాత ఎన్ని సినిమాలు చేసినా, తన జీవితంలో ఆ సినిమానే కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు.
రాజ్ కందుకూరి తన కొడుకు శివ కందుకూరి హీరోగా ఆయన చూసీ చూడంగానే అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. శేష సింధు అనే మహిళా దర్శకురాలు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ లో ఓ చమక్కు వుందని, అది నచ్చి సినిమాను నిర్మించానని అన్నారు.
కేవలం కొడుకును హీరో చేయాలనే ఆలోచన కాకుండా, పలువురితో బాటు కొడుకు కూడా అడిషన్స్ చేసిన తరువాత, అన్నీ విధాల సెట్ అవుతాడని అనుకున్న తరువాతే రంగంలోకి దిగామన్నారు. సినిమాలో హీరో పెళ్లిళ్ల ఫొటోగ్రాఫర్ గా, హీరోయిన్ మ్యూజిక్ డైరక్టర్ కావాలనుకునే అమ్మాయిగా కనిపిస్తుందన్నారు.
సినిమాలో హీరో కేవలం మామూలుగా, మనలో ఒకడిగా వుంటాడు తప్ప, తొలి సినిమా, లాంచింగ్ ఇలాంటి హడావుడి ఏమీ వుండదని అన్నారు. దాదాపు రెండు నెలలు ప్రీ ప్రొడక్షన్, రిహార్సల్ చేసి, జస్ట్ 40 రోజుల్లో సినిమాను ఫినిష్ చేసామన్నారు. ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ఎడిట్ చేసుకుని చూసుకున్నామన్నారు.
ఫైనల్ కాపీని సురేష్ బాబు చూసి కొద్దిగా మరింత షార్ప్ చేసార అని రాజ్ కందుకూరి చెప్పారు. తొలి భాగం జస్ట్ 52 నిమషాలే వుంటుందన్నారు. మలి భాగం గంట మాత్రమే వుంటుందన్నారు. సినిమా యువతకు పక్కాగా నచ్చుతుందన్న ధీమా ఆయన వ్యక్తం చేసారు.