మహేష్ బాబు-బోయపాటి సినిమా అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. అయితే బోయపాటి తీసే ఊరమాస్ సినిమాలు పాల బుగ్గల మహేష్ కు నప్పుతాయా? అన్నది చిరకాలంగా వున్న అనుమానం. ఎవరి సంగతి ఎలా వున్నా, మహేష్ కు అయితే బోయపాటి సినిమాలు తనకు నప్పవు అని, అసలు ఆ సినిమాలు అంతా ఏసి డిసి వ్యవహారం అని ఓ నమ్మకం అయితే వుందట. ఇలాంటి నమ్మకం మహేష్ కు వుందన్నది ఆయన వ్యవహారాలు పూర్తిగా తెలిసిన వారి నుంచి వచ్చిన సమాచారం.
అయితే సరైనోడు హిట్ అయినపుడు మహేష్ కొంచెం ఆలోచనలో పడ్డారట. తన జడ్జ్ మెంట్ సరికాదేమో? బోయపాటి సినిమా వర్కవుట్ అవుతుందేమో? అని చిన్న అనుమానానికి గురయ్యాడట. సర్లే, చూద్దాం అని అనుకుంటూ వుండగానే, వినయ విధేయ రామ సినిమా వచ్చింది. పరమ డిజాస్టర్ గా మిగిలింది.
దాంతో మహేష్ కు క్లారిటీ వచ్చేసిందట. తన డెసిషన్, జడ్జ్ మెంట్ కరెక్ట్ అని ఫిక్స్ అయినట్లు బోగట్టా. దాంతో ఇంకేముంది? మహేష్-బోయపాటి సినిమా అనేది వార్తల్లో తప్ప, వాస్తవ రూపం దాల్చదు అని అర్థం అయిపోవడం లేదూ?