దేన్నో పట్టుకుని దేన్నో ఈదారని సామెత. ఏ చెట్టూ లేనపుడు ఆముదం చెట్టే పెద్దదని మరో సామెత. నలభై ఏళ్ల అనుభవంలో చంద్రబాబు తన పార్టీలో కాస్త బుర్రలో గుజ్జు వున్నవారిని లేదా తనకు పోటీ అవుతారు అనుకున్నవారిని అందరినీ బయటకు పంపారు. దాంతో జీ హుజూర్ అనే వాళ్లే పార్టీలో మిగిలారు. దాంతో ఏమయింది. అదే బాబుగారు జైల్లో వున్నపుడు బయట క్రైసిస్ మేనేజ్ మెంట్ చేసే వారు కరువయ్యారు. దాంతో చినబాబు లోకేష్ కు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా రఘురామ కృష్ణం రాజు కనిపించారు అన్నది రాజకీయ వర్గాల సమచారం.
ఢిల్లీలో కాస్త పరిచయాలు వున్న వ్యక్తి. లీగల్ గా లావాదేవీలు చేయగల కెపాసిటీ. కోర్టులు, పద్దతులు తెలియడమే కాకుండా, ఎటునుంచి ఎలా నరుక్కు రావాలో కొంచెం గట్టిగానే తెలుసు. అందుకే రఘురామకృష్ణం రాజు అలియాస్ ఆర్ఆర్ఆర్ ఇప్పుడు లోకేష్ కు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అని టాక్. కానీ సమస్య ఏమిటంటే రఘురామ కృష్ణ రాజు కేపబులిటీని తక్కువ అంచనా వేయడం లేదు కానీ, ఆయనే స్వయంగా ఇబ్బందుల్లో వున్నారు. ఆంధ్రలో అడుగుపెట్టడానికే జంకుతున్నారు. దానికి ఆయన కారణాలు ఆయనవి. ఆయనకు వచ్చిన అద్భుతమైన ఐడియా ఢిల్లీ లో వుండడమే.
ఇప్పుడు అదే అద్భుతమైన, సంజీవినీ లాంటి ఐడియాను లోకేష్ కు ఇచ్చారు. లోకేష్ కూడా అదే సరైనదని నమ్మి ఇన్నాళ్లుగా ఢిల్లీలో కూర్చుండిపోయారు. ఇప్పుడు యాంటిసిటిపేటరీ బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. అది వస్తే.. వెల్ అండ్ గుడ్. ఫ్లయిట్ వేసుకుని ఆంధ్రకు వచ్చి యువగళం మొదలుపెట్టొచ్చు. కానీ అది రాకపోతే.. అక్కడ వస్తుంది సమస్య. ఇంక బెయిల్ వచ్చేవరకు ఢిల్లీలో వుండిపోవాల్సిందేనా? ఇదేనా, ఆర్ఆర్ఆర్ సలహా సంప్రదింపుల వల్ల వచ్చిన ఫలితం?
చంద్రబాబు బయటకు రావచ్చు. జనాల్లోకి వెళ్లి తన బాధ చెప్పుకోవచ్చు. తనను దోమలు ఎలా పట్టి కుట్టాయో చేతులు కాళ్లు చూపించి జనాల దగ్గర సింపతీ సంపాదించుకోవచ్చు. అంతా బాగానే వుంది. కానీ ధైర్యం చేసి ముందే ఢిల్లీ నుంచి లోకేష్ వచ్చేసి వుంటే వేరుగా వుండేది. ఇప్పుడు బెయిల్ వచ్చే వరకు రాకుండా వుండాలి అంటే కాస్త ఇబ్బందే. లేదా చంద్రబాబు బయటకు వస్తే, ఆయన చూసుకుంటారు తనకు ఏదైనా కష్టం వస్తే అనే ధీమాతో లోకేష్ ఢిల్లీ వదిలి రావచ్చేమో?