పరువు నష్టాన్ని ప్రపంచానికి చాటుకుంటున్నారు!

ఏదో సినిమాలో ఒక డైలాగు ఉంటుంది. పొరబాట్న స్నేహితుడి భార్యను వాటేసుకున్న కమెడియన్, తన వల్ల పొరబాటు జరిగిపోయిందంటూ, దిగులు పడుతున్నట్టుగా  కనిపించిన ప్రతివాడికీ చెప్పడం ద్వారా.. ఆ విషయానికి బోలెడంత పబ్లిసిటీ ఇస్తుంటాడు.…

ఏదో సినిమాలో ఒక డైలాగు ఉంటుంది. పొరబాట్న స్నేహితుడి భార్యను వాటేసుకున్న కమెడియన్, తన వల్ల పొరబాటు జరిగిపోయిందంటూ, దిగులు పడుతున్నట్టుగా  కనిపించిన ప్రతివాడికీ చెప్పడం ద్వారా.. ఆ విషయానికి బోలెడంత పబ్లిసిటీ ఇస్తుంటాడు. వాటేసుకున్నప్పుడు ఎవరూ చూడలేదు గానీ.. వాడిలా చెప్పుకోవడం వల్ల ఊరంతా తెలిసిపోతోందని ఆ స్నేహితుడు కుమిలిపోతాడు. తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహార సరళి కూడా అంతకంటె భిన్నంగా ఎంతమాత్రమూ లేదు.

తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఒక లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఏపీ సీఐడీ చీఫ్ సర్వీసు రూల్స్ ను అతిక్రమించి వైకాపాకు తొత్తుగా పనిచేస్తున్నారని, సీఐడీ చీఫ్ సంజయ్ మీద చర్యలు తీసుకోవాలని ఆయన తన లేఖలో విన్నవించుకునన్నారు.

‘విచారణ లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేశారని, రాజకీయ పక్షపాతాలు లేకుండా పనిచేయాల్సిన సిఐడి చీఫ్ దాన్ని ఉల్లంఘించారని, సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారని’ రామ్మోహన్ నాయుడు ఆరోపిస్తున్నారు. అంత అవగాహన లేకుండా ఎంపీ రామ్మోహన్ ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాని సంగతి. ఎందుకంటే.. చిన్న చోరీ కేసులో అయినా సరే.. నిందితుడిని అరెస్టు చేస్తే కూడా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తారు. అది వారి బాధ్యత మరియు పనిలో భాగం కూడా. 

అలాంటిది.. ఏకంగా 241 కోట్లు స్వాహా చేసిన చంద్రబాబునాయుడును అరెస్టు చేస్తే.. ఆ వివరాలు వెల్లడించకుండా సీఐడీ అధికారులు ఎందుకు ఉండాలి? అలా వివరాలు వెల్లడించకుండా అరెస్టు చేసేసి ఊరుకుంటే.. దానికి కూడా ఎవరో ఒకరు నిందిస్తారు కదా! సీఐడీ చీఫ్ మీద బురద చల్లే ముందు ఈ చిన్న లాజిక్ ను రామ్మోహన్ ఆలోచించి ఉండాల్సింది.

‘సీఐడీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్నారు’ అని చెబుతున్న రామ్మోహన్ నాయుడు.. వారు చేస్తున్న పరువు నష్టం ఏమో గానీ.. అంతకంటె ఎక్కువ ఇలాంటి ప్రచారం ద్వారా.. ఆయనే ఆ పరువునష్టం కలిగిస్తున్నారు. 

అమిత్ షా కు లేఖ రాయడం వల్ల ఏం జరుగుతుందని రామ్మోహన్ అనుకుంటున్నారో తెలియదు. చంద్రబాబు ఎపిసోడ్.. అమిత్ షాకు తెలియకుండానే ఉంటుందనుకుంటున్నారో.. లేదా, తను లేఖ రాసిన వెంటనే.. అమిత్ షా యుద్ధప్రాతిపదికన, ఏపీ సీఐడీ చీఫ్ మీద చర్య తీసుకుంటారని కలగంటున్నారో అర్థం కావడం లేదు.