ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై శాపనార్థాలు, హెచ్చరికలు సర్వసాధారణమయ్యాయి. ఉద్యోగుల డిమాండ్లన్నింటికీ తలొగ్గలేదని ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇవాళ్టి నుంచి వాళ్ల ఉద్యమ కార్యాచరణ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తమతో పెట్టుకుంటే భ్రష్టు పట్టిపోతావని, ప్రభుత్వం కూలిపోతుందనే శాపనార్థాలు, హెచ్చరికలు పంపారు.
విజయవాడ ఎన్జీవో కార్యాలయంలో ఆదివారం పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రభుత్వం నడుస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. పీఆర్సీ నివేదికను వెలువరించకుండా ఫిట్మెంట్ను ప్రకటించడంలో చరిత్రలో ఎప్పుడూ లేదన్నారు.
ఉద్యోగుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఉద్యోగులపై సోషల్ మీడియాలో ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఉద్యోగులు తమ సత్తా ఏంటో చూపి డిమాండ్లను పరిష్కరించు కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగులను అణచివేయాలని ప్రయత్నించిన వాళ్లంతా భ్రష్టుపట్టారని హెచ్చరించారు. ప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలు కూలిపోక తప్పదని ఆయన ఘాటుగా హెచ్చరించడం గమనార్హం.
పరోక్షంగా జగన్ భ్రష్టపడతారని హెచ్చరించారు. అలాగే జగన్ ప్రభుత్వం కూలిపోతుందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలే ప్రభుత్వంతో ఉద్యోగులను మరింత దూరం చేస్తున్నాయని చెప్పొచ్చు. వివిధ రాజకీయ నేపథ్యం కలిగిన ఎమ్మెల్సీలు తమ ఇష్టానుసారం మాట్లాడుతూ… చివరికి తమకు నష్టం కలిగిస్తారేమోనన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకుంది.