సుకుమార్ కట్ చేసిన టీజరేనా ఇది?

బాహుబలి-2 ప్రచారానికి, అసలా భాగంపైన జనానికి ఆసక్తి కలగడానికి పనికొచ్చిన లైన్ “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?”. దేశ వ్యాప్తంగా అదొక సెన్సేషన్ అయిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒక బహిరంగ సభలో…

బాహుబలి-2 ప్రచారానికి, అసలా భాగంపైన జనానికి ఆసక్తి కలగడానికి పనికొచ్చిన లైన్ “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?”. దేశ వ్యాప్తంగా అదొక సెన్సేషన్ అయిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒక బహిరంగ సభలో “కట్టప్ప నే బాహుబలి కో క్యూ మారా” అంటూ జనం చప్పట్ల మధ్య అన్నారు కూడా. 

అదే తరహాలో పుష్ప-2 కి కూడా బజ్ తేవడానికి “వేర్ ఈజ్ పుష్ప?” అనే ప్రశ్నని ప్రచారాస్త్రంగా పెట్టుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అసలా మూడు నిమిషాల సుదీర్ఘ టీజర్లో ఉన్నదేంటి? అరవ డబ్బింగ్ సినిమాలని తలపించే విధంగా ఆ టీవీ వార్తల బిట్లన్నీ కలిపి ఊదరగొట్టి చివర్లో సీసీటీవీ ఫుటేజిలో పుష్పని చూపెట్టారు. ఇది చూస్తే ప్రస్తుతం తప్పించుకుని పారిపోయిన ఖలిస్తాన్ ఉద్యమకారుడు అమృత్ పాల్ సింగ్ వ్యవహారంలా అనిపించింది. అతను కూడా సీసీ కెమెరాల్లో చిక్కుతున్నాడు కానీ చేతికి చిక్కట్లేదని వార్తలొస్తొనే ఉన్నాయి కామెడీగా. 

అదలా ఉంచితే ముసుగులో ఉన్న వ్యక్తి మొహం చూసి పులి రెండడుగులు వెనక్కి వేసింది కాబట్టి అతను పుష్ప అట. సరే…ఎంత అతి ఉంటే అంత హీరోయిజం అనుకుంటే ఓకే. 

అసలీ టీజర్ సుకుమార్ దగ్గరుండే కోయించాడా అనే అనుమానాలొస్తున్నాయి చూస్తుంటే. ఎందుకంటే ఎక్కడా కూడా అతని తెలివి, సిగ్నేచర్ స్టైల్ కనపడదు. 

ఆ విషయాన్ని పక్కనపెట్టి ఒక విషయం చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో ఒకరు “గరికిపాటికి గట్టిగా కౌంటర్ ఇచ్చిన “వేర్ ఈజ్ పుష్ప” టీజర్” అని ఒకరెవరో రాసారు. సారాంశమేంటా అని చూస్తే ఇది…

ఆ మధ్యన గరికిపాటి ఒక ప్రవచనంలో “పుష్ప” లాంటి దొంగల్ని హీరోలుగా చూపించడం సరైన పద్ధతి కాదని చెప్పారట. దానికి సమాధానం ఈ టీజర్లో చెప్పాడట సుకుమార్. పుష్ప దొంగే అయినా ఆ సొమ్మును పేదలకి పంచుతున్నాడని, కనుక హీరోయేనని, అలాంటి వాడు ఆదర్శం కాక ఏవిటని ఆ పోస్ట్ సారాంశం. 

ఎర్రచందనం చెట్లని కొట్టొద్దని చట్టం చెబితే, ఆ చట్టాన్ని ఉల్లంఘించి కొట్టి అమ్మేసుకుని ఆ డబ్బుని నచ్చినవాళ్లకి పంచితే అది నేరం కాకుండా పోతుందా?

రామోజిరావు మార్గదర్శి కేసులో తనని తాను సమర్ధించుకున్నది కూడా ఈ పాయింట్ మీదనే. అసలా మార్గదర్శి వ్యాపారం ఆ విధంగా చెయ్యడమే తప్పని చట్టం చెబుతుంటే..ఎవ్వరినీ మోసం చెయ్యలేదు కనుక అలా చట్టవ్యతిరేక వ్యాపారం చెయ్యడం నేరం కాదు అని ఆయన తరపు లాయర్ల వాదన. ఈ పుష్ప2 సమర్ధన కూడా అలాగే ఉంది. 

కథంతా ఈ “వేర్ ఈజ్ పుష్ప” లో చెప్పేసినట్టుగానే ఉన్నా కూడా సుకుమార్ పని తనం మీద నమ్మకున్నవాళ్లందరికీ అతనెలా తెరకెక్కించాడన్న ఆసక్తే ఉంటుంది. 

అయితే ఇలాంటి పాయింట్ ని ఇప్పుడే రివీల్ చెయ్యడం వల్ల కంటెంటులో మంచి చెడుల మీద ఇలాంటి చర్చలే జరుగుతాయి. అలా కాకుండా నేరుగా సినిమాలో చూపించి ఉంటే ఆ ఫ్రెంజీలో పాసయిపోవచ్చు. అది వేరే సంగతి. 

“కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు” అనే ప్రశ్నకి సమాధానం దొరక్క జనాల్లో ఆసక్తి పెరిగింది. బాహుబలి-2 కథ ఏమై ఉండొచ్చు అనే దాని మీద రకరకాల కథలు కూడా పుట్టుకొచ్చాయి. జనం అదే పనిగా దాని గురించి ఆలోచించారు. అయితే అవేవీ కాకుండా మరొకటేదో తెర మీద ఉండడం వల్ల, అది కూడా చాలా ఎమోషనల్ గా తీయబడడం వల్ల అద్భుతమనిపించింది. 

ఇక్కడ పుష్ప-2 విషయంలో అది కొరవడింది. “వేర్ ఈజ్ పుష్ప” కి జవాబు చివర్లో చెప్పేయడమే ఇక్కడ మైనస్. 

అందుకే అనేది…ఇది సుకుమార్ లాంటి మేథావి తలలోంచి వచ్చిన ఆలోచనేనా అని! 

– శ్రీనివాసమూర్తి