చినబాబూ.. ఆ హామీ ఇస్తే అధికారం మీదే!

నారావారి చినబాబు లోకేష్ కు రైతుల మీద ప్రేమ వెల్లువెత్తిపోతున్నది. రైతుకోణంలో నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేలా విమర్శలు చేయడానికి కొత్త స్క్రిప్ట్ లోకేష్ చేతికి అందినట్టుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో…

నారావారి చినబాబు లోకేష్ కు రైతుల మీద ప్రేమ వెల్లువెత్తిపోతున్నది. రైతుకోణంలో నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేలా విమర్శలు చేయడానికి కొత్త స్క్రిప్ట్ లోకేష్ చేతికి అందినట్టుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క రైతు మీద తలసరి రెండున్నర లక్షల రూపాయల అప్పులు ఉన్నాయని ఆయన కొన్ని కాకుల లెక్కలను తయారు చేసుకున్నారు. రైతు ఆత్మహత్యలలో దేశంలోని ఏపీ మూడో స్థానంలో ఉందని కూడా ఒక కథ చెప్పారు. 

పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా జంబులదిన్నె వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహించిన నారా లోకేష్.. వారి మీద అవ్యాజమైన ప్రేమానురాగాలను కురిపించారు. సాగు పెట్టుబడి పెరిగిపోయింది అంటూ.. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ పై అధిక పన్నులు వేయడం వల్లనే ఇలాంటి చేటు జరిగిందని లోకేష్ అభివర్ణించారు.

సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ఆయన విజ్ఞత ప్రశ్నార్థకం అవుతోంది. ‘పెట్రోలు డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం అధిక పన్నులు వేయడం ప్రజలను ఇబ్బంది పెడుతోంది’ అని ఈ ప్రతిపక్ష నాయకుడు భావిస్తున్నారా? ఈ సంగతి ఆయన తేల్చి చెప్పాల్సి ఉంది. ఎందుకంటే పెట్రోలు డీజిల్ మీద అరాచకంగా అదనపు పన్నులు వేయడం అనేది.. కేవలం వ్యవసాయ రంగంలో సాగు పెట్టుబడి పెరగడానికి కారణం కావడం మాత్రమే కాదు.. సమస్త రంగాలకు చెందిన ప్రజా జీవనం భారంగా మారడానికి కారణం అవుతూ ఉంటుంది. 

కేవలం రైతులను మభ్యపెట్టడానికి నారా లోకేష్ ఈ మాట చెప్పి ఉండొచ్చు కానీ… ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం దోపిడీ చేస్తున్నదని భావిస్తే.. దానిని అడ్డుకోవాలని కోరిక ఆయనలో ఉంటే.. ఆ ఒక్క హామీ ఇస్తే చాలు తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది.

లోకేష్ సభలలో తన ముందు ప్రజలు సమస్యలు ప్రస్తావించినప్పుడు.. ఏదో గాలివాటు వ్యాఖ్యానాలు చేయడంతో సరిపుచ్చకుండా… తాను మాట్లాడే మాటలు మీద తనకే చిత్తశుద్ధి ఉంటే కనుక, పెట్రోలియం ఉత్పత్తుల మీద రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న అరాచక పన్నులను తమ ప్రభుత్వం పూర్తిగా తొలగిస్తుందని హామీ ఇవ్వాలి. ఒక వ్యవసాయ రంగం మాత్రమే కాదు! ప్రజానీకం సమస్తంగా– తెలుగుదేశం పార్టీని నెత్తిన పెట్టుకుంటుంది. 

కరడు కట్టిన జగన్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్ప, ఓట్లు మొత్తం సైకిల్ గుర్తుకే పడతాయి. చిరస్థాయిగా అధికారంలో ఉండేలాగా వారు పాలన పగ్గాలు చేత పట్టవచ్చు. అలాంటి హామీ ఇవ్వలేనప్పుడు దానితో ముడిపెట్టి మాట్లాడకుండా నోరు మూసుకోవడం మంచిది. 

జగన్ సర్కారు ఎక్కువ పన్నులు వేస్తోంది అనేముందు, తాము గెలిచిన తర్వాత ఆ పన్నులు తగ్గిస్తాం అని మాట చెప్పే ధైర్యం ఉండాలి. అది లేని వాడికి ఆరోపణలు చేసే అధికారం కూడా ఉండదు. గాలివాటు మాటలు అని ప్రజలు అనుకుంటారే తప్ప ఒక నాయకుడు ప్రజలకు ఇస్తున్న హామీగా దానిని గుర్తించరు. రాజకీయాలలో ఈ ప్రాథమిక సత్యాన్ని తెలుగుదేశం పార్టీ చిన్న బాబు తెలుసుకుంటే మంచిది.