జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవడం ఆ పార్టీ మానేసింది. ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ జనసేనపై కాకుండా పొత్తులపై మాత్రమే దృష్టి సారించారు. జనసేనను స్థాపించి పదేళ్లు అవుతున్నా, ఇంత వరకూ ఆ పార్టీ నిర్మాణానికి నోచుకోలేదు. రాజకీయాలంటే సినిమాల్లో నటించడం అంత ఈజీ కాదని పవన్‌కు తత్వం బోధపడినట్టుంది. దీంతో సినిమా షూటింగ్‌లు కాదని జనంలోకి వెళ్లేంత సమయం, తీరిక, ఓపిక ఆయనలో కొరవడ్డాయి.
2019 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన జనసేన… భారీ మూల్యం చెల్లించుకుంది. రెండు చోట్లా తనను ఓడించిన వైసీపీని గద్దె దించాలనే పట్టుదలతో పవన్ ఉన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పవన్ కలలు కంటున్నారు. అయితే కలలను సాకారం చేసుకునే దిశగా పవన్ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు చేయడం లేదు. ఆయన నమ్మకం, ధైర్యం కేవలం టీడీపీతో పొత్తు మాత్రమే. పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లి వీరమరణం పొందలేనని బహిరంగంగానే తేల్చి చెప్పారు.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు నిత్యం జనంలోనే వుంటున్నారు. తాజాగా ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ వైసీపీ ఇంటింటికీ వెళ్లి, ప్రజల ఆమోదం మేరకు స్టిక్కర్లు అంటిస్తోంది. దీన్ని కౌంటర్ చేసేందుకు తిరుపతిలో జనసేన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘మాకు నమ్మకంలేదు జగన్, మా నమ్మకం పవన్’ అనే స్టిక్కర్లను వైసీపీ స్టిక్కర్ల పక్కనే జనసేన నేతలు అంటించారు.
ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో జనసేనను ఉతికి ఆరేస్తున్నారు. జనసేనాని పవన్‌కల్యాణ్ నమ్మకం చంద్రబాబు అని నెటిజన్లు తమదైన రీతిలో సెటైర్స్ పేల్చుతున్నారు. పవన్‌కల్యాణ్‌కు తనపై తనకే నమ్మకం లేదని, కానీ తిరుపతిలో టీటీడీ దర్శనం టికెట్లు అమ్ముకునే నాయకుడి ఆధ్వర్యంలో ప్రచారం కోసం ఓవరాక్షన్ చేస్తున్నారంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికైనా జనంలో జనసేనాని నమ్మకం తెచ్చుకునే పనులు చేయాలని హితవు చెబుతున్నారు. పదేళ్ల పవన్ రాజకీయ ప్రస్థానం చంద్రబాబుపై నమ్మకంతో సాగుతోందని నెటిజన్స్ విమర్శిస్తున్నారు.