జనసేనాని పవన్‌కల్యాణ్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ వెయ్యి కోట్ల ఆఫర్ ఇచ్చారంటూ ఎల్లో మీడియాధిపతి ఆర్కే ఆ మధ్య తన కొత్త పలుకులో రాయడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. జనసేనాని పవన్ స్పందిస్తూ… కనీసం రూ.10 వేల కోట్లు అని చెప్పకపోయారా? అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. మెగా బ్రదర్ నాగబాబు మాత్రం అమాయకత్వంతోనో, అజ్ఞానంతోనో ఆర్కేపై విరుచుకుపడ్డారు.
తన రాతలు టీడీపీతో పొత్తుకు అడ్డంకి అవుతాయని ఆందోళన చెందిన ఆర్కే… సుదీర్ఘ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తన రాతల్ని అపార్థం చేసుకున్నారని, ఉద్దేశం అది కాదు, ఇది కాదంటూ జనసేనను కూల్ చేసుకునేందుకు ఆర్కే తంటాలు పడాల్సి వచ్చింది. కానీ పవన్‌కు వెయ్యి కోట్ల ఆఫర్‌ని మరోసారి ఆయన ఇవాళ్టి వీకెండ్ కామెంట్స్‌లో స్పష్టం చేయడం గమనార్హం. కేసీఆర్ ఆఫర్‌ని మరోసారి ఆర్కే పునరుద్ఘాటించడం విశేషం.
‘ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితితో చేతులు కలిపితే ఎన్నికల వ్యయం కింద వెయ్యి కోట్ల రూపాయల వరకు పెట్టుకుంటానని జనసేనాని పవన్ కల్యాణ్‌కు ఆఫర్ ఇచ్చిన విషయాన్ని కూడా అదే సమయంలో వెల్లడించాను. అయితే ఈ విషయాన్ని జన సైనికులు ఆవేశపడి అపార్థం చేసుకున్నారు. నిజం నిప్పు వంటిది. ఎప్పటికైనా బయటకు వస్తుంది’
జనసేనాని పవన్‌కల్యాణ్‌కు వెయ్యి కోట్ల ఆఫర్‌ను కేసీఆర్ ఇచ్చారనేందుకు తన వద్ద సమాచారం వుందని ఆర్కే పదేపదే స్పష్టం చేయడం చర్చనీయాంశమవుతోంది. అయితే ఇలాంటి రాతలతో పవన్‌కల్యాణ్‌పై ప్యాకేజీ స్టార్ అనే విమర్శలు స్థిరపడతాయని జనసేన ఆందోళన చెందుతోంది.
ఒకవైపు జనసేనకు అనుకూలంగా వుంటూనే, మరోవైపు ప్యాకేజీ ముద్రలను వేయడం వెనుక టీడీపీ కుట్ర వుందని జనసేన అనుమానిస్తోంది. భవిష్యత్‌లో టీడీపీతో ఏదైనా కారణంతో జనసేనకు పొత్తు కుదరని పక్షంలో, రాజకీయంగా పవన్‌ను భ్రష్టు పట్టించడానికి వ్యూహాత్మకంగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారనే అభిప్రాయానికి ఆర్కే రాతలు బలం కలిగిస్తున్నాయి. అసలే కాల్షీట్లను అమ్ముకునే పవన్‌కల్యాణ్‌కు, ఎన్నికల సమయంలో పార్టీని అమ్ముకోరంటే నమ్మేదెలా? అనే అనుమానం ప్రజల్లో కలిగించడంలో ఎల్లో మీడియా తన వంతు పాత్ర పోషిస్తోందని జనసేన మండిపడుతోంది.
పవన్‌కు కేసీఆర్ వెయ్యి కోట్ల ఆఫర్ ఇచ్చారనేది నిప్పులాంటి నిజమని ఆర్కే మరోసారి తేల్చి చెప్పారు. దీనిపై స్పందించాల్సింది పవన్‌కల్యాణే. లేదంటే ఆర్కే రాతనే నిజమని నమ్మే పరిస్థితి. ఎందుకంటే ఒకే విషయాన్ని పదేపదే చెప్పడం వల్ల, మానసికంగా బలమైన ముద్ర వేస్తుంది. మరీ ముఖ్యంగా పవన్‌పై ఇప్పటికే ప్యాకేజీ ఆరోపణలున్నాయి. అదే ఆయనకు నెగెటివ్ అయ్యే ప్రమాదం వుంది.