బీజేపీ ప్రవచించే రాజకీయ నీతులు ఆచరణలో భలే చిత్రాలుగా మారుతుంటాయి! రాజకీయ నైతికత గురించి అవిశ్రాంతంగా ఉపదేశాలు చేస్తుంటారు కమలనాథులు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అయితే దేశ ప్రజాస్వామ్యానికి కొత్త పాఠాలు ఉపదేశిస్తూ ఉంటారు. ప్రజాస్వామ్య విలువలూ, ప్రజాస్వామ్యం గొప్పదనం, ప్రజాస్వామ్యంలో రావాల్సిన సంస్కరణల గురించి మోడీ తరచూ ఉపదేశాలు ఇస్తూ ఉంటారు.
అయితే చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొడుతూ ఉంటుంది కమలం పార్టీ. ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన, రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూలగొట్టింది. ఫిరాయింపుదార్లతో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. మరి మోడీనేమో ప్రజాస్వామ్యం గురించి ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. బీజేపీనేమో ప్రభుత్వాలను పడగొడుతూ ఉంటుంది.
ఇలా బీజేపీ తమకు ప్రజాస్వామ్యబద్ధంగా బలం లేకపోయినా, ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ ఉన్న రాష్ట్రాల్లో ఒకటి గోవా. వాస్తవానికి గోవాలో ఎన్నికలను నిర్వహించడం కూడా వ్యర్థమేమో! ఈ బుల్లి రాష్ట్రంలో రేపటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా, నంబర్లతో నిమిత్తం లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది నిస్సందేహమైన విషయం. అయితే ఊరికే ఎన్నికలు నిర్వహిస్తున్నారక్కడ.
ఇప్పుడు పోటీలో నిలవనున్న ఎమ్మెల్యేల్లో అరవై శాతం మంది అటూ ఇటూ గెంతిన వారేనట. ప్రతి పది మంది అభ్యర్థుల్లో ఆరు మంది గత ఐదేళ్లలూ వివిధ పార్టీలు మారిన వారే! ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి! ఇలాంటి ఫిరాయింపుదార్లే బీజేపీ అభ్యర్థుల జాబితాలో కూడా ఉన్నారు.
ఇలాంటి సీట్లలో ఒకటి పనాజీ కూడా. ఇక్కడ నుంచి గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ తనయుడు పోటీ చేయడానికి ప్రయత్నాలు చేశాడు. అయితే వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించే బీజేపీ పారికర్ తనయుడికి ఎమ్మెల్యే టికెట్ కాకుండా.. వేరే ప్రత్యామ్నాయం ఇస్తామందట. ఈ విషయాన్ని బీజేపీ నేతలే స్వయంగా ప్రకటించారు.
వారసత్వంగా ఎమ్మెల్యే సీటు కాకుండా.. మరో ప్రత్యామ్నాయం కోరుకొమ్మన్నారట! అయితే.. పారికర్ తనయుల్లో ఒకడైన ఉత్పల్ పారికర్ మాత్రం తనకు పనాజీ ఎమ్మెల్యే టికెట్టే కావాలంటూ పట్టుపట్టాడు. అయితే పనాజీ నుంచి కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేకు బీజేపీ టికెట్ ను ఖరారు చేసింది! వారసుడి కన్నా ఫిరాయింపుదారుడే బెటరని బీజేపీ భావించింది. దీంతో ఉత్పల్ తను ఇండిపెండెంట్ గా బరిలోకి దిగనున్నట్టుగా ప్రకటించాడు. గెలిచి బీజేపీలోకి చేరతానన్నట్టుగా ఆయన ప్రకటించుకున్నాడు.