ప్రస్తుతం మార్కెట్లో నిలబడిన సినిమా ఏది?

మార్కెట్లో ప్రస్తుతం ఇదో వింత పరిస్థితి. ఫ్లాప్ అయిన సినిమాలు ఎలాగూ ఆడడం లేదు. బాగున్న సినిమాలు కూడా ఆడడం లేదు. అదే విచిత్రం. ఇంకా చెప్పాలంటే, ప్రస్తుతం మార్కెట్లో గట్టిగా నిలబడిన సినిమా…

మార్కెట్లో ప్రస్తుతం ఇదో వింత పరిస్థితి. ఫ్లాప్ అయిన సినిమాలు ఎలాగూ ఆడడం లేదు. బాగున్న సినిమాలు కూడా ఆడడం లేదు. అదే విచిత్రం. ఇంకా చెప్పాలంటే, ప్రస్తుతం మార్కెట్లో గట్టిగా నిలబడిన సినిమా ఏదీ లేదు.

ఈ వారం రావణాసుర, మీటర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమాకు ప్రశంసల కంటే పెదవి విరుపులే ఎక్కువయ్యాయి. ట్విస్టులు పెట్టాలనే తపనలో ఎమోషన్ ను మిస్ అయ్యారు మేకర్స్, దీంతో సినిమా మిస్ ఫైర్ అయింది.

ఇక రావణాసురతో పాటు వచ్చిన మీటర్ సినిమాది మరో కథ. రజనీకాంత్, బాలకృష్ణ లాంటి మాస్ హీరోలు చేయాల్సిన కథను, కిరణ్ అబ్బవరం లాంటి చిన్న హీరో చేసి చతికిలపడ్డాడు. గడిచిన 2-3 చిత్రాలుగా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న ఈ కుర్రాడు, ఈసారి ఏకంగా 'మాస్ మీటర్' చూపించి బోల్తాపడ్డాడు.

ఇలా ఈ వారం రిలీజైన 2 సినిమాలు ఫ్లాప్ ముద్ర వేసుకున్నాయి. రవితేజ మాస్ హీరో అయినప్పటికీ, రెండో రోజైన ఈరోజు ఆక్యుపెన్సీ లేదు. రేపటికి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే దాదాపు జీరో. ఇక కిరణ్ అబ్బవరం సినిమాకు ఆక్యుపెన్సీ లేక షోలు క్యాన్సిల్ అవుతున్నాయి.

ఈ 2 సినిమాల కంటే ముందొచ్చిన దసరా సినిమా హవా కూడా తగ్గింది. ఆంధ్రా, సీడెడ్, నార్త్ లో నిరాదరణకు గురైన ఈ సినిమా, నైజాంకు మాత్రమే పరిమితమైంది. అటు విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ మూవీ థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్టే. వచ్చే వారం ఓటీటీలోకి కూడా వచ్చేస్తోంది.

కృష్ణవంశీ తీసిన రంగమార్తాండ సినిమా బాగుందన్నారంతా. కానీ ఆడియన్స్ మాత్రం పట్టించుకోలేదు. టోటల్ వాషవుట్. ఇక దిల్ రాజు తీసిన బలగం సినిమా కూడా బాగుందన్నారంతా. కానీ తొందరగా ఓటీటీలో రిలీజ్ చేసి, చేజేతులా థియేట్రికల్ మార్కెట్ ను నాశనం చేసుకున్నారు.

ఇలా చూసుకుంటే, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సినిమా ఒక్కటి కూడా లేదు. శాకుంతలం, రుద్రుడు సినిమాలకు ఇది మంచి టైమింగ్. కంటెంట్ బాగుంటే కనుక ఈ గ్యాప్ ను క్యాష్ చేసుకోవడం చాలా ఈజీ.