పార్టీ మారడం లేదు మొర్రో అంటున్న ఎమ్మెల్యే

ఆయన మీద ప్రతిపక్షాల చూపు పడింది. అంతే బదనాం చేస్తున్నారు. దానికి కారణం ఆయన ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి మారడం. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు.…

ఆయన మీద ప్రతిపక్షాల చూపు పడింది. అంతే బదనాం చేస్తున్నారు. దానికి కారణం ఆయన ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి మారడం. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు. భీమిలీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అవంతి శ్రీనివాసరావు మూడేళ్ళ పాటు మంత్రిగా పనిచేశారు.

ఆరు నెలల క్రితం వరకూ ఆయన విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా ఉన్నరు. భీమిలీలో పార్టీని పటిష్టం చేసే క్రమంలో ఆయనకు బాధ్యతల భారం తొలగించారు. అవంతి శ్రీనివాసరావు మీద గత కొద్ది రోజులుగా పార్టీ మార్పు ప్రచారం సాగుతోంది. దీంతో అన్నీ విని చూస్తూ వచ్చిన మాజీ మంత్రిలో అసహం కట్టలు తెంచుకున్నట్లుంది.

నేను పార్టీ మారడం లేదని గట్టిగా మీడియా ఎదుటనే చెప్పారు. నేను టీడీపీలోకి వెళ్తున్నానని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాను అన్నది పూర్తిగా నిరాధారమైన ప్రచారం అని కొట్టిపారేశారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ నేను రాజకీయాల్లో ఉన్నంతవరకూ వైసీపీలోనే ఉంటానని అవంతి బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచేది వైఎస్ జగన్ అని ప్రతిపక్షాలకు ఏపీలో పుట్టగతులు ఉండవని ఆయన జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు మైండ్ గేమ్ ఆడుతూ తాను పార్టీ మారుతున్నట్లుగా తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అవంతి శ్రీనివాసరావు పార్టీ మార్పు మీద ఇంతటితో ప్రచారం ఆగుతుందా లేక అలాగే కొనసాగుతుందా అన్నది చూడాలి. 

అవంతి సైలెంట్ గా తన పని తాను చేసుకుని పోవడం, హడావుడి లేకుండా ఉండడం వల్లనే ఈ ప్రచారం సాగుతోంది అని అంటున్నారు.