ఒక మనిషి తన జీవిత కాలాన్ని మరొక్క మనిషితోనే దాంపత్య జీవితంలో కొనసాగించడం మన సంప్రదాయం. అయితే ఇది మనం చెప్పుకునే నైతికత, ఏకపత్నీవ్రతం ఇదంతా గత కొన్ని దశాబ్దాల కథే! కనీసం ఒక్క యాభై యేళ్ల కిందటి పరిస్థితులను తరచి చూసినా.. మన దేశంలో బహుపత్నీవ్రతం పరమ రొటీన్! మా తాతకు ఇద్దరు భార్యలు, మా తాతకు ముగ్గురు అని చెప్పుకునే వాళ్లు గ్రామాల్లో చూస్తే చాలా మందే ఉంటారు! అలాగే గ్రామాల స్థాయిల్లో అప్పుడు ఉంపుడుగత్తే అనే మాట కూడా బాగా పాపులరే! రాయలసీమ ప్రాంతంలో అయితే *చుట్టంరాలు* అంటూ ఉంటారు! ఇప్పుడు ఆ మాటలు పెద్దగా వినిపించవు!
అధికారికంగా మరో మగువతో మగాడు సంసారం చేసే సంప్రదాయం ఇదంతా. తన భర్తకు చుట్టంరాలు ఉందని భార్యలకూ తెలుసు! ఇది సామాజికంగా ఆమోదం పొందిన పద్ధతే ఒకరకంగా! రెండో భార్య, మూడో భార్య సంప్రదాయాలకైతే పూర్తి ఆమోదం ఉండేది. మొదటి భార్యకు పిల్లలు పుట్టలేదని, లేదా మగసంతానం పుట్టలేదని కూడా రెండో పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లూ బోలెడంతమంది ఉంటారు. యాభై యేళ్ల కు పూర్వం ఇలాంటి రెండో, మూడో వివాహాలు ఎలాంటి ఆక్షేపణలకూ గురయ్యేవి కావు!
మరి ఈ సామాజిక చరిత్రను తవ్వుతూ పోతే.. అంతకన్నా పూర్వం ఇంకెలా ఉండేదో! అదెలా ఉన్నా.. మగవాడు వీలైనన్ని పెళ్లిళ్లు చేసుకోవడం మన సంస్కృతి ఆమోదం పొందిన అంశమే అని కచ్చితంగా చెప్పవచ్చు. వీలైనన్ని పెళ్లిళ్లు చేసుకోవడాన్ని, చుట్టంరాళ్లను మెయింటెయిన్ చేయడాన్ని మగవాడు తన ఘనతగా చూసుకునే సంప్రదాయం బహుశా శతాబ్దాల పాటు కొనసాగింది. అందుకే శ్రీరాముడి ఏకపత్నీవ్రత్యం ఆదర్శప్రాయమైంది! ఏకపత్నీవ్రత్యం రాముడిని దేవుడిగా నిలిపింది. మానవుడికి భిన్నంగా నిలవగలిగేవాడే కదా దేవుడు!
అయితే గత నాలుగు దశాబ్దాల నుంచి మాత్రం భారతీయులకు రాముడి మార్గం ఆదర్శనీయమే కాదు, ఆచరణీయమూ అయ్యింది! రెండు పెళ్లిళ్లు చేసుకుని రెండు కుటుంబాలను పోషించే శక్తిసామార్థ్యాలు, అంత ఓపిక మగవాళ్లకు సహజంగానే లేకుండా పోయింది. పెరిగిన స్త్రీ సాధికారత కూడా రెండో పెళ్లి వాడిని ఆమోదించే పరిస్థితి లేదు. కర్మం కలిసిరాక మొదటి వివాహం విడాకుల వరకూ వెళ్లినా, రెండో పెళ్లికి మొదటి పెళ్లి పిల్ల దొరకదు. గత రెండు దశాబ్దాల్లో రెండో పెళ్లి మగాడికి మొదటి పెళ్లి పిల్ల జరిగే పనీ కాదని తేలిపోయింది. విడాకుల శాతం కాస్త పెరిగిన నేపథ్యంలో.. రెండో పెళ్లి వారికి రెండో పెళ్లి వారు దొరికే పరిస్థితి కూడా వచ్చినట్టుగా ఉంది.
మరి సామాజికంగా వివాహం విషయంలో ఈ పరిణామాలన్నీ మార్పులైనప్పటికీ.. ఇండియాలో మ్యారిడ్ లైఫ్ లో ఉంటూ కూడా ఇంకో డేటింగ్ వైపు చూసే వారి శాతం పెరుగుతోందని అధ్యయనాలు అంటున్నాయి. దీనికి రకరకాల కారణాలు. మారిన సామాజిక పరిస్థితులు, ఆర్థిక స్వతంత్రం, పాశ్చాత్య నాగరికత ప్రభావం, అన్నింటికీ మించి మనిషిలో సహజంగానే ఉండే శృంగార ఆసక్తులు, ఆపై భార్యభర్తల్లో ఒకరంటే మరొకరికి పడని తత్వం… ఇవన్నీ ఆ కారణాల్లో భాగమే!
పరస్పరం ఆసక్తి తగ్గిపోవడం, ఆర్థికంగా ఎవరికి వారు సంపాదించుకునే అవకాశం ఉండటం, పరస్పరం ఆధారపడాల్సిన పరిస్థితి కూడా తగ్గడం, ఒకరితోనే జీవిత కాలం అన్ని రకాలుగానూ బోర్ కొట్టే వ్యవహారం కావడం.. ఈ తరహా పరిస్థితులు మ్యారిటల్ లైఫ్ లోనూ మరొకరితో డేటింగ్ వైపు అడుగులు వేయడానికి అవకాశాన్ని ఇస్తూ ఉండవచ్చు.
మరి ఈ డేటింగ్ ఎక్కడి వరకూ అంటే.. అది ఒక్కోరి విషయంలో ఒక్కో స్థాయిలో ఉండవచ్చు. కొందరు పార్ట్ నర్ కు చెప్పలేని, చెప్పిన విషయాలను కూడా ఇలాంటి పార్ట్ నర్ తో చెప్పుకుని ఊరట పొందడం, తమ మ్యారిటల్ పార్ట్ నర్ కన్నా.. ఈ పార్ట్ నర్ తమను బాగా అర్థం చేసుకుంటాడని వీరు భావిస్తూ.. స్నేహానికి మించిన బంధాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఆ పై శృంగార సంబంధంగా మారడానికి పెద్ద సమయం తీసుకోదు కూడా!
ఇక భార్యభర్తల మధ్యన ఎమోషనల్, ఫిజికల్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలాంటి బంధాలు ఏర్పడటం ఒక వంతు అయితే, శృంగారం పట్ల యావతోనే మరి కొందరి బంధాలూ ఏర్పడవచ్చు. మ్యారిటల్ లైఫ్ లో సెక్సువల్ రిలేషన్ సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి అవకాశాలూ ఉండవచ్చు. బోర్ డమ్, కొత్త దనాన్ని కోరుకోవడం వంటి రీజన్లతో ఈ తరహా బంధాలకు కొందరు తాపత్రయపడే అవకాశాలూ ఉన్నాయి. ఈ అంశం గురించి ఒక సంస్థ అధ్యయనం చేయగా..ఏకంగా 82 శాతం మంది అందులో తప్పేం ఉందన్నారట!
ప్రధానంగా టైర్ 2, టైర్ 3 నగరాల స్థాయిలో చేసిన ఈ సర్వేలో ఈ షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయట. వీరిలో 44 శాతం మంది అయితే పెళ్లి చేసుకున్నా.. ఒకేసారి పార్ట్ నర్ తో సహా మరొకరితో లవ్ లో ఉండటంలో సంతోషం ఉందన్నారట!
అయితే బంధం కన్నా.. శృంగార సంబంధం వరకే ఎక్కువ మంది ఆసక్తి చూపడం విశేషం. 55 శాతం మంది పెళ్లి తర్వాత మరొకరితో శృంగారం పట్ల ఆసక్తిని కనబరిచారట. 37 శాతం మంది అయితే ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నప్పటికీ మరొకరితో సెక్స్ వరకూ అయితే తప్పేం లేదన్నారట! 33 శాతం మంది తమ పార్ట్ నర్ తమను నిర్లక్ష్యం చేస్తుండటంతోనే ఇలాంటి బంధం పట్ల ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారటగా చెప్పారట. 23 శాతం మంది తమ పార్ట్ నర్ తమను చీట్ చేస్తూ ఉన్నాడని తెలిసి ప్రతీకారంగా అయినా మరో సంబంధం కోసం ఆసక్తిని చూపిస్తున్నారట. అయితే ఇది కేవలం 1500 శాంపిల్స్ తో చేసిన అధ్యయనం.